మాయావతికి సుప్రీంకోర్టు షాక్‌!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : తన హయాంలో నిర్మించిన స్మారక మందిరాల ఖర్చును వెంటనే ప్రభుత్వానికి చెల్లించాలని యూపీ మాజీ సీఎం, బహుజన సమాజ్‌వాదీ పార్టీ నేత మాయావతిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది తాత్కాలిక ఆదేశాలని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రజాధనం ఖర్చు చేయకుండా మాయావతిని నియంత్రించాలంటూ వేసిన పిటిషన్‌ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. లక్నో, నొయిడాతో పాటు యూపీలో పలు చోట్ల స్మారక మందిరాలను మాయావతి నిర్మించారు. వాటిలో భారీ ఏనుగు (మాయావతి పార్టీ ఎన్నికల గుర్తు) విగ్రహాలతో పాటు పలు పార్కులను కూడా నిర్మించారు. వీటి కోసం రూ. 2600 కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఈ సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. స్మారక మందిరాల నిర్మాణంలో మనీ లాండరింగ్‌ జరిగిందనే ఆరోపణలపై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు మొదలు పెట్టింది.