మార్కెట్‌కు భారీగా తరలివస్తున్న ధాన్యం

జనగామ,జ‌నం సాక్షి ): గ్రామాల్లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, జనగామ మార్కెట్‌కు అమ్మకానికి వస్తున్న ఉత్పత్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా యార్డుకు ధాన్యం వస్తున్నా కొనుగోళ్లలో జాప్యం కొనసాగుతుండడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ సీజన్‌లో వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం వెల్లువెత్తుతోంది. యాసంగి సీజన్‌కు చెందిన ధాన్యం దిగుబడులు వస్తుండడంతో ఇటు పాత యార్డు, అటు కొత్త కాటన్‌యార్డు సైతం ధాన్యం బస్తాలు, రాశులతో నిండిపోయాయి. రఘునాథపల్లి, మద్దూరు, నర్మెట, బచ్చన్నపేట, లింగాలఘనపురం, దేవరుప్పుల, పాలకుర్తి మండలాలతోపాటు సరిహద్దులోని యాదాద్రి జిల్లాకు చెందిన పలు గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున ధాన్యం, మక్కలను మార్కెట్‌ యార్డుకు తెస్తున్నారు. భారీగా ధాన్యం తరలిరావడం, గతంలో కొనుగోలు చేసిన బస్తాల తరలింపులో జాప్యం జరుగుతోంది. దీంతో పాత, కొత్త యార్డులో ధాన్యం రాశులు నిండిపోయాయి. జనగామలో సివిల్‌ సప్లయ్‌ ఆధ్వర్యంలో ఓడిసీఎంఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, తేమ, నాణ్యత సాకుతో కొనుగోలు అధికారి మడత పేచీ పెడుతుండడంతో అమ్మకాలు, కొనుగోళ్లు గందరగోళంగా మారుతున్నాయి. గ్రామాల్లో ఐకేపీ, ఇతర సంస్థల కొనుగోలు కేంద్రా ల్లో రైతులు అమ్ముతున్న ధాన్యానికి 15 నుంచి 20 రోజులైనా డబ్బులు చెల్లింపు జరగకపోవడంతో రైతులు జనగామ యార్డుకు తరలించి వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.