మార్గదర్శకాలకు విరుద్దంగా ప్రకటనలు

పలు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌31(జ‌నం సాక్షి): సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ ప్రకటనలు జారీ చేశారని పేర్కొంటూ కేంద్రం, ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలను, బిజెపిలు ఈవిషయంపై వివరణ తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఆప్‌ ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు కేంద్రం, బిజెపిలతో పాటు ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, తెలంగాణా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. వీటిలో తెలంగాణా తప్ప మిగిలినవన్నీబిజెపి పాలిత రాష్ట్రాలే కావడం గమనార్హం. నాలుగు వారాల్లోగా తమ వివరణ తెలియజేయాలని జస్టిస్‌ రంజన్‌ గోగోరు కూడిన ధర్మాసనం పేర్కొంది. ముందుగా ఇచ్చిన సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కేంద్రం, బిజెపి, ఈ రాష్ట్రాలు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసినట్లు పిటిషనర్‌ ఆరోపించారు. ఈ ఉల్లంఘనల పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 2015లో మే 13న ప్రభుత్వ ప్రకటనల సమస్యను నియంత్రించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే మార్చి 18, 2016లో సుప్రీం కోర్టు తన ఉత్తర్వును సవరించింది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించవచ్చునని పేర్కొంది.