మాల్దీవుల ఎన్నికల్లో..  ఇబ్రహీం మహమ్మద్‌ గెలుపు


– ఇబ్రహీంకు మద్దతునిచ్చిన 53.8శాతం మంది ఓటర్లు
– శుభాకాంక్షలు తెలిపిన భారత విదేశాంగశాఖ
మాలీ, సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి) : తీవ్ర రాజకీయ సంక్షోభం నడుమ జరిగిన మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో విపక్షనేత ఇబ్రహిం అబ్దుల్‌ నల్హీ అఖండ విజయం సాధించారు. మాల్దీవులు ప్రజల్లో నియంతగా ముద్రపడ్డ ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్‌ యావిూన్‌కు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేసి, ఆయన పాలనకు చరమగీతం పాడారు. అక్కడి ఎన్నికల కమిషన్‌ సోమవారం ఉదయం ఎన్నికల ఫలితాలను విడుదల చేసింది. ఇబ్రహీం 53.8శాతం ఓట్లను దక్కించుకుని గెలుపొందారని ఈసీ ప్రకటించింది. ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి, ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న అబ్దుల్లా యవిూన్‌ను ఓడించి ఇబ్రహీం అనూహ్య రీతిలో విజయం సాధించారు. యవిూన్‌ అధికార బలంతో రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని ప్రచార సమయంలో ఇబ్రహీం ఆందోళన వ్యక్తంచేశారు. కాగా ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రజలు ప్రతిపక్ష పార్టీకే పట్టం కట్టారు.
ఇబ్రహీం గెలుపుతో మాల్దీవుల్లో ఆయన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎండీపీ) జెండాలను ప్రదర్శిస్తూ వీధుల్లో నృత్యాలు చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన తర్వాత యవిూన్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. యవిూన్‌ను గద్దె దించాలని ప్రయత్నించిన యునైటెడ్‌ అపోజిషన్‌ కూడా ఇబ్రహీంకు మద్దతుగా నిలిచింది. గెలుపొందినట్లు తెలిసిన అనంతరం యవిూన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు ఇబ్రహీం తెలిపారు. శాంతియుతంగా, నిరాటంకంగా అధికార బదిలీకి సహకరించాలని ఆయన్ని కోరినట్లు వెల్లడించారు. అలాగే వెంటనే రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని అడిగినట్లు చెప్పారు. తమ పార్టీ గెలుపుతో దేశానికి తిరిగి ప్రజాస్వామ్యం వచ్చిందని ఎండీపీ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్‌ నషీద్‌ అన్నారు. ఫిబ్రవరిలో అధ్యక్షుడు యవిూన్‌ మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించడంతో పాటు సుప్రీంకోర్టు జడ్జిలను సహా పలువురు రాజకీయ నేతలను అరెస్ట్‌ చేయించడం సంచలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో అక్కడ తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది.
ఎన్నికల ఫలితాలను ఆహ్వానించిన భారత్‌ ..
మాల్దీవులు అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఇబ్రహీం మహమ్మద్‌కు భారత్‌ విదేశాంగశాఖ శుభాకాంక్షలు తెలిపింది. దేశం ప్రజాస్వామ్యానికి, చట్టానికి ఇస్తున్న విలువను ఈ ఎన్నికలు ప్రతిబింబిస్తున్నాయని పేర్కొంది. మాల్దీవుల్లో మూడోసారి అధ్యక్ష ఎన్నికల పక్రియను విజయవంతంగా పూర్తిచేయడాన్ని ఆహ్వానిస్తున్నామని, ప్రాథమిక సమాచారం ప్రకారం ఇబ్రహీం మహమ్మద్‌ సోలిహ్‌ విజయం సాధించారని భారత్‌ విదేశాంగశాఖ పేర్కొంది. ఇబ్రహీంకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. యవిూన్‌ మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత ఆ దేశానికి, భారత్‌కు మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. యవిూన్‌ అత్యయిక స్థితిని ప్రకటించడాన్ని భారత్‌ వ్యతిరేకించింది. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని కోరింది. 45 రోజుల తర్వాత అక్కడ ఎమర్జెన్సీని తొలగించారు.