మాల్యా కోసం ఆర్థర్‌ రోడ్‌ జైలు సిద్దం

ఛగన్‌ భుజ్‌బల్‌ ఉన్న గది పక్కనే ఏర్పాట్లు

లండన్‌ కోర్టుకు వీడియో సమర్పణ

ముంబయి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యాను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఆయన కోసం ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలు బారక్‌ నం.12ను సిద్ధం చేశారు. మహారాష్ట్ర మాజీ డిప్యూటి సిఎం ఛగన్‌ భుజ్‌బల్‌ ఉంటున్న గది ప క్కనే మాల్యా కోసం గదిని సిద్దిం చేశారు. ఇటీవల మాల్యాను ఉంచబోయే బారక్‌ నం.12 సెల్‌కు సంబంధించిన వీడియోను సీబీఐ అధికారులు లండన్‌ న్యాయస్థానానికి పంపించిన విషయం తెలిసిందే. భారత జైళ్లలో గాలి, వెలుతురు ఉండదని మాల్యా ఫిర్యాదు చేయడంతో లండన్‌ కోర్టు జైలు వీడియో పంపించాల్సిందిగా సీబీఐని అడిగింది. తొలుత ఆగస్టు 10వ తేదీన సీబీఐ అధికారులు జైలు గది వీడియోను తీశారు. దాని పట్ల అసంతృప్తిగా ఉండటంతో ఆగస్టు 13న మరోసారి వీడియో తీశారు. చివరి సారిగా ఆగస్టు 16న మూడోసారి వీడియో తీసి కోర్టుకు పంపించారు. ఇప్పుడు మాల్యా ఉంచబోయే గదికి కొత్త హంగులు ఏర్పాటు చేశారు. గదిలో టైల్స్‌ మార్చడంతో పాటు, గోడలకు పెయింటింగ్‌లు వేశారు. ఆయన కోసం బాత్‌రూంలో వెస్టన్ర్‌ టాయిలెట్‌ ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని మార్పులు చేసినట్లు పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్‌ ప్రమేష్‌ తెలిపారు. ‘జైలు గదికి రంగులు వేశాం. బారక్‌ నం.12 గదిలో టైల్స్‌ మార్చాం. టాయిలెట్‌, ప్లోరింగ్‌ కూడా మార్చేశాం. ఇందుకోసం దాదాపు 45 మంది కార్మికులు పనిచేశారు. ఆర్థర్‌ రోడ్‌ జైలులోని రెండు గదుల్లో మార్పులు చేశాం. ఒక దాంట్లో మహారాష్ట్ర మాజీ మంత్రి ఛగన్‌ భుజ్‌బల్‌ ఉంటుండగా.. మరో దాన్ని మాల్యా కోసం సిద్ధం చేశాం’ అని సదరు పీడబ్ల్యూడీ కాంట్రాక్టర్లు వెల్లడించారు. బారక్‌ నం.12 గదిలో చేసిన మార్పులను సీబీఐ అధికారులు మళ్లీ వీడియో తీసి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపించినట్లు తెలుస్తోంది. మాల్యాను ఉంచబోయే జైలుకు సంబంధించిన వీడియోను పంపించాల్సిందిగా లండన్‌ కోర్టు గతంలో భారత్‌ అధికారులనుఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ అధికారులు ఆర్థర్‌ రోడ్‌ జైలులోని బారక్‌ నం.12ను వీడియో తీసి పంపించారు.