మిత్రుల్ని ఒప్పించాలి ప్రజల్ని మెప్పించాలి
2014లో అధికారమే లక్ష్యం
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మనం సిగ్గుపడాలి
భూమీ, నీరు పోరాటాలను తక్కువ చేసిచూడొద్దు : ‘చింతన్’లో సోనియా
జైపూర్, జనవరి 18 (జనంసాక్షి) :
యూపీఏలోని భాగస్వామ్య పక్షాలను ఒప్పించి.. ప్రజలను మెప్పించి పరిపాలన సాగించాలని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. పాలనాపరంగా తీసుకునే నిర్ణయాలకు మిత్రులు అంగీకారం తెలిపేలా నడుచుకోవాలని సూచించారు. శుక్రవారం జైపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ మేధోమథన సదస్సులో సోనియా ప్రారంభోపాన్యాసం చేశారు. 2014 ఎన్నికల్లో గెలుపే అజెండాగా ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. యూపీఏలో ప్రధాన పార్టీగా ఉన్నా మన కోటలు బీటలు వారుతున్నాయని, పరిస్థితిని చేజారనివ్వొద్దని శ్రేణులను హెచ్చరించారు. పార్టీని కాపాడుకొనేందుకు ప్రతీ కార్యకర్త సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లవుతోందని, ఈ తొమ్మిదేళ్లలో పార్టీ అనేక సంక్షోభాలు ఎదుర్కొందని అన్నారు. ప్రస్తుతం కొత్త తరహా సవాళ్లు మన ముందున్నాయని, వాటిని అధిగమించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక సామరస్యం నాణేెనికి బొమ్మాబొరుసులాంటివన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, పటిష్టత తదితర అంశాలను ప్రస్తావించిన ఆమె పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేశారు. పార్టీ బలాలు, బలహీనతలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లోనూ పోటీతత్వం పెరిగిందని తెలిపారు. సంప్రదాయ ఓటర్లను కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక తొమ్మిదేళ్లకు సమావేశమయ్యామని గుర్తు చేసిన సోనియా.. ఈ తొమ్మిదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు. కొత్త తరహా సవాళ్లు మన ముందున్నాయని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సామాజికంగా, ఆర్థికంగా ఎన్నో మార్పులు వచ్చాయని, ఎంత అభివృద్ధి చేస్తున్నా కొన్ని రాష్టాల్ర నుంచి రాజకీయ మద్దతు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాలపై మనమంతా సిగ్గుపడాలన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను విస్మరిస్తే పార్టీకే నష్టమని హెచ్చరించారు. పిల్లలు, యువతులపై వేధింపులను అరికట్టాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆత్మపరిశీలన చేసుకోవాలని పేర్కొన్నారు. భూమి కోసం, నీటి కోసం జరుగుతున్న ఉద్యమాలను తక్కువ చేసి చూడకూడదని ఉద్బోధించారు. పార్టీని బలోపేతం చేసేందుకు, భాగస్వామ్య పక్షాలను గౌరవించడానికి మధ్య సమతౌల్యతను సాధించాలని సోనియా పార్టీ శ్రేణులకు సూచించారు. పాకిస్తాన్‌తో భారత్ జరిపే చర్చలు నాగరిక సమాజం ఆమోదించే రీతిలో ఉండాలని సూచించారు. పొరుగు దేశాలతో శాంతియుత చర్చలు కొనసాగించాలని సూచించారు. ఏ చర్చలు చేపట్టినా అవి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ప్రతి గ్రామం, పట్టణంలో కనిపించే కాంగ్రెస్ క్రమంగా ప్రభావం కోల్పోతోందని సోనియా హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, తమిళనాడు, గుజరాత్ లాంటి రాష్టాల్ల్రో బలోపేతం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ బలాలు, బలహీనతలను గుర్తించి పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించాలని నిర్దేశించారు. రోజురోజుకు అవినీతి ఆరోపణలు పెరిగిపోతున్న తరుణంలో ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలను అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలను ప్రజలు మరింత ఆశిస్తున్నారని తెలిపారు. అందుకనుగుణంగా మనం కూడా బలోపేతం కావాలన్నారు. అవినీతిని నిర్మూలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, దీన్నితీవ్రంగా పరిశీలించాలని సూచించారు. పార్టీ నాయకత్వానికి, యువతకు మధ్య సరైన వారధి లేదని సోనియా ఎత్తిచూపారు. నేతల మధ్య మరింత సమన్వయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఐక్యంగా పని చేయకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ కొన్ని అవకాశాలను కోల్పోయిందని వాపోయారు. ఇటీవల తీసుకువచ్చిన కీలక సంస్కరణల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని సోనియా తెలిపారు. విధాన నిర్ణయాల్లో మిత్రపక్షాలతో మరింత సమన్వయం సాధించాలని సూచించారు. అసమానత్వం, పేదరికంపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని సోనియా తెలిపారు. అభివృద్ధితోనే సమానత్వం సాధ్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న బలహీనవర్గాలు, దళితులు, పేదలు, మహిళలను అభివృద్ధి బాట పట్టించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కేవలం ఎన్నికల్లో గెలుపే పరమావధిగా కాకుండా నిబద్ధతతో పని చేయాలని సూచించారు. మరే దేశంలో లేని విధంగా మన దేశం ఉపాధి, ఉద్యోగాల లేమి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్, నేతలు రాహుల్‌గాంధీ, ఏకే ఆంటోని, ద్విజయ్‌సింగ్, అంభికాసోని, గులాంనబీ ఆజాద్, మోతిలాల్ వోరా, గిరిజావ్యాస్, ఆనంద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.