‘ముందస్తు’లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం

– పొత్తులపై తుది నిర్ణయం అధిష్ఠానానిదే
– గెలుపు స్థానాలను ఒదులుకోం
– విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో తెలంగాణ నేతలు శుక్రవారం సమావేశమై రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. సుమారు 3 గంటల పాటు జరిగిన భేటీ అనంతరం ఉత్తమ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై రాహుల్‌గాంధీ దిశానిర్దేశం చేసినట్లు ఉత్తమ్‌ తెలిపారు. తెలంగాణలో తెరాసను ఎలాగైనా గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిలో భాగంగానే ఇతర పార్టీలతో పొత్తు
పెట్టుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. పొత్తుల గురించి నేతలెవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని రాహుల్‌ సూచించినట్లు తెలిపారు. పొత్తు పెట్టుకున్నప్పటికీ కచ్చితంగా గెలుస్తామని ధీమా ఉన్న సీట్లకు మాత్రం వదులుకోవద్దని రాహుల్‌ స్పష్టం చేసినట్లు ఉత్తమ్‌ తెలిపారు. రాష్ట్రంలోని పొత్తులపై తుది నిర్ణయం మాత్రం అధిష్ఠానానిదేనని ఆయన స్పష్టం చేశారు.
పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి – కుంతియా
తెలంగాణ నేతల సమావేశంలో రాహుల్‌గాంధీ అందరి నుంచి అభిప్రాయాలు స్వీకరించారని సీనియర్‌ నేత కుంతియా తెలిపారు. పొత్తులపై తెదేపా, సీపీఐ పార్టీలతో ఉత్తమ్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. పొత్తులపై మాత్రం తుదినిర్ణయం అధిష్ఠనానిదేనని స్పష్టం చేశారు. ముఖ్యమైన నాయకుల స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమన్నారు. కేసీఆర్‌ హిట్లర్‌ పాలన నుంచి విముక్తి కలిగించడమే లక్ష్యంగా తెలంగాణలో పనిచేస్తామన్నారు.