ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందా?

కేంద్రం పావులు కదుపుతోందా?..

కెసిఆర్‌ కూడా ముందస్తుకు సానుకూలమేనా?

కడియం సూచనలు దేనికి సంకేతం

వరంగల్‌,జూన్‌21(జ‌నం సాక్షి): ఈ ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లోక్‌ సభ ఎన్నికలు కూడా ముందస్తుగా వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ ఇదే జరిగితే శాసనసభ ఎన్నికలు కూడా ముందస్తుగా రావచ్చు. అలాంటప్పుడు ఎన్నికలకు మూడు, నాలుగు నెలలకు మించి సమయం ఉండదని వరంగల్‌ వేదికగా డిప్యూటి సిఎం కడియం శ్రీహరి చేసిన ప్రకటన చూస్తుంటే రాజకీయ నిర్ణయాలు చకచకా జరిగిపోతున్నాయని అర్థంఅ వుతోంది. నీతి ఆయోగ్‌ సమావేశంలో ఇటీవల ప్రధాని మోడీ చేసిన జమిలి ఎన్నికల ప్రకటన కూడా ముందస్తు ఎన్నికలకు సంకేతంగా భావిస్తున్నారు. ఇప్పటికే మూడు రాష్ట్రాలైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ల అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఆ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికల నగారా మోగనుంది. ఈ దశలో వాటితో పాటే కేంద్రంలో కూడా ఎన్నికలు జరపాలని మోడీ అనుకుంటు న్నారన్న ప్రచారం ఇటీవల ఊపందుకుంది. దీంతో పాటే మేలో ఎన్నికలు జరగాల్‌ఇన తెలుగు రాష్ట్రాలను కూడా కలుపుకుని పోయేలా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జమిలి పేరుతో ముందుగానే అంటే ఓ అరునెలల ముందే ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా డిప్యూటి సిఎం కడియం శ్రీహరి కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రకటన కూడా దీనికి బలాన్‌ఇన ఇస్తోంది. కాబట్టి ఈలోపు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలు మిషన్‌ భగీరథ, రైతుబంధు, రైతుబీమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇతర సంక్షేమ,అభివృద్ధి పథకాల్లో వేగం పెంచాలని పిలుపునిచ్చారు. అనుకున్న సమయంలోగా వాటిని పూర్తి చేసేలా పనిచేయాలని కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లో టిఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యుల సమావేశంలో రానున్న రాజకీయ పరిణామాలను, భవిష్యత్‌ కార్యాచరణను చర్చించారు. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రస్తుత రాజకీయ వాతావరణం పూర్తిగా అనుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి నాయకత్వంలో తీసుకొచ్చిన పథకాల పట్ల రాష్ట్ర ప్రజల్లో చాలా సానుకూలత వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టిఆర్‌ఎస్‌ పార్టీకి 110 అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలు స్పష్టంగా చెబుతున్నాయి. పార్టీకి అనుకూలంగా ఉన్న ఈ రాజకీయ వాతావరణాన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు తమకు వ్యక్తిగతంగా కూడా అనుకూలంగా మార్చుకోవాలి. కార్యకర్తలకు, ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్‌ను సరి చేసుకోవాలి. పాత, కొత్త నాయకుల మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకోవాలి. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అందరికీ అందేలా కృషి చేయాలని కడియం చేసిన సూచనలు ముందస్తుకు సంకేతంగా భావిస్తున్నారు. రైతుబందు తరవాత పరిస్థితులు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. రైతుబీమాతో అదిమరింత సానుకూలంగా మారగలదని అంటున్నారు. ఇకపోతే వచ్చే మే ఎండల్లో ఎన్నికలకు వెళ్లే కన్నా అక్టోబర్‌ నవంబర్‌ లేదా డిసెంబర్‌ జనవరి అనుకూలమన్న భావనలో సిఎం కెసిఆర్‌ ఉన్నారు. ముఖ్యంగా మిషన్‌ భగీరథ పథకం కింద ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయిస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాల ద్వారా ప్రతి రైతుకు లబ్ది చేకూరేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలలో వేగం పెంచారు. ఈ రాజకీయ అనుకూల వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని ముందస్తు ఎన్నికలు రిగితే ముందుకే పోవాలన్న భావన నేతల్లో ఉంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నాయకులంతా సమన్వయంతో పనిచేసి 12 అసెంబ్లీ స్థానాలను, రెండు పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకుని ముఖ్యమంత్రి కేసిఆర్‌కు కానుకగా ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి టిఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో తెలిపారు. ముందుగా పార్టీలకతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెరాస బలపర్చిన అభ్యర్థులనే గెలిపించి రాబోయే ఎన్నికలకు నాంది పలకాలని జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రులు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో పండించిన పంటలకు మద్దతు ధర లభించేలా రైతు సమన్వయసమితిల ద్వారా కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. రైతుబంధు పథకాన్ని అందరూ స్వాగతిస్తుంటే…ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందంటూ ఎదరుదాడి చేస్తున్నారు.