ముందు కూటమికి నాయకుడెవరో చెప్పండి

– కూటమిలో ఉన్నదంతా రాష్ట్ర స్థాయి నేతలే
– వారి వల్ల దేశాభివృద్ధి సాధ్యం కాదు
– దేశ ప్రజలు మోదీకే గట్టిగా మద్దతు తెలుపుతున్నారు
– వారి కళ్లలో మోదీపై ఉన్న ప్రేమను నేను గమనించాను
– రాబోయే ఎన్నికలు ఏకపక్షమే
– కూటమి ప్రభావం ఉండబోదు
– కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లండి
– బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
అహ్మదాబాద్‌, ఫిబ్రవరి12(జ‌నంసాక్షి) : దేశంలో మహాకూటమి అంటూ ప్రచారం చేసుకొనే నేతలు.. ముందు విూ కూటమికి నాయకుడు ఎవరో చెప్పాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా సవాల్‌ విసిరారు. కూటమిలో ఉన్నదంతా రాష్ట్రస్థాయి నేతలేనని, కూటమి ప్రభావం లోక్‌సభ ఎన్నికల్లో ఉండదని అమిత్‌షా అన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘మెగా పరివార్‌ భాజపా పరివార్‌’ పేరుతో ప్రతి భాజపా నేత, కార్యకర్త తమ ఇంటి వద్ద పార్టీ జెండాను ఎగురవేసే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడారు.. కేవలం రాష్ట్ర స్థాయి నేతలు మాత్రమే మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నారని,  దీనివల్ల ఎన్నికల్లో భాజపాకు ఎటువంటి నష్టం జరగదన్నారు. మహాకూటమి నుంచి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నానని, ఆ కూటమికి నాయకుడు ఎవరని ప్రశ్నించారు. ప్రపంచ శక్తిగా ఎదగడానికి 2019 లోక్‌సభ ఎన్నికలు భారత్‌కు చాలా ముఖ్యమని అమిత్‌షా పేర్కొన్నారు. నేను దేశం మొత్తం పర్యటించానని, దేశ ప్రజలు ప్రధాని మోదీకే గట్టిగా మద్దతు తెలుపుతున్నారన్నారు. వారి కళ్లలో మోదీపై ఉన్న ప్రేమను నేను గమనించానని చెప్పుకొచ్చారు.
మహాకూటమి గురించి నన్ను భాజపా కార్యకర్తలు పలు ప్రశ్నలు అడిగారని, నేను వారికి ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నానని, ఆ కూటమి ప్రభావం ఉండబోదన్నారు.  జేడీఎస్‌ అధినేత దేవెగౌడ గుజరాత్‌లో, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహారాష్ట్రలో, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కేరళలో ఎన్నికల ప్రచారం, ప్రసంగాలు చేపడితే ఏం జరుగుతుందని..  వారి ప్రభావం ఉండబోదని ఎద్దేవా చేశారు. ఎందుకంటే వారు రాష్ట్ర స్థాయి నేతలు మాత్రమేనని, రానున్న ఎన్నికల్లో వారికి మద్దతు లభించదన్నారు. వారి నాయకుడు ఎవరు? ఈ దేశాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు? ఈ విషయంపై వారు స్పష్టత ఇవ్వాలన్నారు. ఎన్డీఏలో నరేంద్ర మోదీ మాత్రమే ప్రధాని అభ్యర్థి అని, ఆయన ఈ దేశాన్ని ముందుకు నడిపించగలరని అన్నారు. భాజపా యూపీలో ఈసారి కనీసం 74సీట్లు సాధిస్తుందని అన్నారు. భాజపా కార్యకర్తలు ప్రతిపక్షాలు గురించి పట్టించుకోకుండా ప్రజల వద్దకు మన పార్టీని తీసుకెళ్లాలని అమిత్‌ షా సూచించారు.