ముంబై ఆస్పత్రి నుంచి లాలూ డిశ్చార్జ్‌

ముంబై,ఆగస్టు25(జ‌నం సాక్షి ): ఛాతీ నొప్పి, హిమోగ్లోబిన్‌ లోపం కారణంగా ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. సోమవారం ఉన్నట్టుండి ఆయన అస్వస్థతకు గురికావడంతో ఏసియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. ఇవాళ సాయంత్రం లాలూను పాట్నా తీసుకెళ్లనున్నట్టు సమాచారం. దాణా కుంభకోణం కేసుల్లో బిస్రా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ కొన్ని వారాల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. వైద్య అవసరాల కింద ఈ నెల 17 వరకు రాంచీ హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.గత మూడు నెలల కాలంలో లాలూ ఆస్పత్రిపాలు కావడం ఇది రెండోసారి. ఇదే ఆరోగ్య సమస్యలతో ఆయన అస్వస్థతకు గురికావడంతో జూన్‌ 19న ఆస్పత్రికి తరలించగా.. కొన్ని రోజులపాటు అక్కడే ఉన్నారు. దీనికి ముందు మార్చి 16న అసౌకర్యంగా ఉన్నట్టు చెప్పడంతో చికిత్స నిమిత్తం రాంచీలోని రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కొన్నిరోజులు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స అందించారు.

—————