ముంబై నగరంలో అధ్వాన్నంగా రోడ్లు

అసెంబ్లీ ఎదుట రోడ్ల ధ్వంసం

నవనిర్మాణ సేన నిరసనలు

ముంబయి,జూలై17(జ‌నం సాక్షి): నగరంలోని రోడ్లు గుంతలతో అధ్వానంగా ఉన్నాయని నిరసన తెలిపేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు ఏకంగా అక్కడి అసెంబ్లీ ఎదుట రోడ్లను ధ్వంసం చేశారు. మంగళవారం ఉదయం రాజ్‌ ఠాక్రే పార్టీ అయిన ఎంఎన్‌ఎస్‌కి చెందిన కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి అసెంబ్లీ మంత్రాలయం ఎదుట రోడ్డులోని కొంతభాగాన్ని ధ్వంసం చేశారు. సోమవారం ఎంఎన్‌ఎస్‌ కార్యకర్తలు రాష్ట్ర ప్రజా పనుల విభాగానికి చెందిన కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో థానే, ముంబయిలకు చెందిన 9 మంది పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నగరంలోని రోడ్లు గుంతలమయం కావడానికి కారణమైన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎంఎన్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి సందీప్‌ దేశ్‌పాండే ప్రశ్నించారు. రోడ్లు ఆ విధంగా తయారవుతున్నా పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రోడ్లు ధ్వంసం చేసినందుకు తమ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు, మరి మిగతా చోట్ల రోడ్లు పాడవడానికి కారణమైన వారి సంగతేంటి అని ఆయన ప్రశ్నించారు. ముంబయిలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల నుంచి వర్షాలు తగ్గినప్పటికీ రోడ్లపై ఏర్పడిన గుంతల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రజలు వీటి కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఎంఎన్‌ఎస్‌ వెల్లడించింది.

—————————