ముంబై నార్త్‌ లోక్‌సభ నుంచి ఉర్మిళ పోటీ!


– అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం
– పార్టీలో చేరిన రెండురోజులకే టికెట్‌ దక్కించుకున్న ఉర్మిళ
ముంబయి, మార్చి29(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌లో చేరిన బాలీవుడ్‌ నటి ఊర్మిళ మటోండ్కర్‌కు టికెట్‌ ఖాయమయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ముంబై నార్త్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఊర్మిళలకు టికెట్‌ ఖాయం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్‌ పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ.. ముంబై నార్త్‌ అభ్యర్థిగా ఊర్మిళ అభ్యర్థిత్వాన్ని ఆమోదించిందని సీఈసీ జనరల్‌ సెక్రటరీ ఇన్‌చార్జి ముకుల్‌ వాస్నిక్‌ తెలిపారు. ముంబై నార్త్‌ స్థానాన్ని కాంగ్రెస్‌కు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ స్థానంలో మరోసారి బాలీవుడ్‌ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున గోపాల్‌ శెట్టి పోటీ చేస్తున్నారు. ఊర్మిళ బుధవారమే కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తన తొలి అడుగులను కాంగ్రెస్‌ పార్టీతో వేస్తున్నానన్నారు. మనస్ఫూర్తిగా ప్రజాసేవ చేస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారో లేదో ప్రత్యర్థి పార్టీలు, నేతల్ని టార్గెట్‌ చేశారు. ప్రధాని వ్యక్తిగతంగా మంచి వ్యక్తేనని.. ప్రధానిగా ఆయన అనుసరిస్తున్న విధానాలే మంచిది కాదన్నారు. ఇదిలాఉంటే ముంబయి ఉత్తర నియోజకవర్గంలో ఒకప్పుడు భాజపాకు మంచి పట్టుంది. 1989 నుంచి 2004  వరకు భాజపా నేత రామ్‌ నాయక్‌ ఇక్కడ ఎంపీగా ఉన్నారు. అయితే 2004 లోక్‌సభ ఎన్నికల్లో రామ్‌ నాయక్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థి, ప్రముఖ బాలీవుడ్‌ నటుడు
గోవిందా గట్టి షాక్‌ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి సంజయ్‌ నిరుపమ్‌ విజయం సాధించారు. గత ఎన్నికల్లో సంజయ్‌ నిరుపమ్‌పై భాజపా నేత గోపాల్‌ శెట్టి భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఈ నియోజకవర్గంపై కమలం పార్టీ మళ్లీ పట్టు పొందగలిగింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఈ స్థానంపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టిపెట్టింది. భాజపాకు పోటీగా ప్రముఖ నేతను బరిలోకి దింపాలని భావించింది. ఈ నేపథ్యంలో ఊర్మిళను రంగంలోకి దింపింది. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో ముంబయి ఉత్తర పోరు ఆసక్తికరంగా మారింది.