ముఖ్యమంత్రి అల్పాహర పథకం అద్భుతం – పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌

జనంసాక్షి , మంథని : మన భవిష్యత్‌ తరాల బాగు కోసమే సీఎం కేసీఆర్‌ గొప్ప పథకాలు అమలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ గొప్పగా ఆలోచన చేసి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ముఖ్యమంత్రి అల్పాహర పథకాన్ని మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆయన ప్రారంభించారు. విద్యార్దులతో కలిసి ఆయన అల్పాహరం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహరం అందించడం జరుగుతుందన్నారు. ఈనాడు గొప్పగా ఆలోచన చేసిన సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహర పథకం ఎంతో అద్బుతమైందన్నారు. ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తెల్లవారితే ఏదో కూలీ పనికో వ్యవసాయ పనులకో వెళ్తుంటారని, ఉదయం పాఠశాలకు వెళ్లే వారి బిడ్డలకు మంచి ఆహరం అందించాలని, చిన్నారులకు ఈ వయస్సులోనే మంచి ఆహరం అందిస్తే మంచి భవిష్యత్‌ ఉంటుందని సీఎం కేసీఆర్‌ ఆలోచన చేశారన్నారు. తెలంగాణ వస్తే ఏమస్తదని ఎంతో మంది అన్నారని, తెలంగాణ వస్తే ఇలాంటి కొత్త కొత్త పథకాలు వస్తాయని గుర్తించాలన్నారు.అంగన్‌వాడీ కేంద్రాని వచ్చే చిన్నారులకు ఇప్పటికే పౌష్టికారం అందిస్తన్న ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకునే చిన్నారుల ఆరోగ్యంపట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుని అల్పాహర పథకం అమలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజలకు అన్ని వసతులు కల్పించే వాళ్లే నిజమైన ప్రజాప్రతినిదులని, గతంలో ప్రజలు, ప్రజాప్రతినిదులు వేరని,అదికారులు ప్రజలు వేరనే అభిప్రాయాలు ఉండేవని కానీ ఈనాడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. అనేక విషయాల్లో పేదోడికి ఆర్థిక బారం తగ్గించాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని, ఇందులో ముఖ్యంగా విద్య వైద్యంపై ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే మన ఊరు మన బడి పథకంలో అనేక పాఠశాలల్లో వసతులు కల్పించడం జరిగిందన్నారు.అదే విదంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఆడబిడ్డల కాన్పు తల్లిదండ్రులకు భారం కావద్దని మాతా శిశు ఆస్పత్రులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈనాడు రూపాయి ఖర్చు లేకుండా ఆడబిడ్డల కాన్పులు జరుగుతున్నాయని ఆయన వివరించారు. ప్రజా సంక్షేమంతో పాటు భవిష్యత్‌ తరాల గురించిఆలోచన చేసే గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఆయన కొనియాడారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పెరటి కూరగాయాల విత్తనాలను పాఠశాల ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు.