ముగిసిన ఆషాడ మాసం

చివిరి అమావస్యను చుక్కల అమావాస్యగా పరిగణింపు

తిరుమల,జూలై28(జనంసాక్షి ): నేడు చుక్కల అమావాస్య. ఆషాఢమాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు, దీని గురించి ఆధునిక కాల యువతకు అంతగా తెలిసి ఉండదు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ఒకే చోట సవిూపంగా చేరినప్పుడు అమావాస్య ఏర్పడుతుంది. తర్వాత సూర్యుని నుండి చంద్రుడు ప్రతిదినం తూర్పువైపు కదులుతాడు. ఈ చంద్రగతి ఆధారంగా చంద్రామానం ఏర్పడుతుంది. సూర్యుని నుండి చంద్రుడు 12
డిగ్రీలు నడిస్తే ఒక తిధి అవుతుంది. ఇలాగ ఒక అమావాస్య నుండి ఇంకో అమావాస్య వరకు 29 రోజుల 44. నిమిషాల 2.87 సెకండ్ల కాలం జరుగునని వేద జ్యోతిషం తెలుపుతుంది. ఈ అమావాస్యకు పితృ దేవతలు అదిపతులుగా ఉంటారు. పంచాంగ ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే, కర్కటక సంక్రాంతికి దక్షిణాయణం మొదలవుతుంది. దక్షిణాయణ కాలంలో పితృ దేవతలు మనకు సవిూపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయణంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు, దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరున పేదలకు దాన ధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుంది.