మునుగోడు నుండే తెరాస పతనానికి నాంది – భాజపా నేత గజ్జల యోగానంద్”
శేరిలింగంపల్లి, ఆగస్టు 21( జనంసాక్షి): నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కమలం వికసిస్తుందని, ఈ గెలుపుతోనే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది ప్రారంభమవుతుందని శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి గజ్జల యోగానంద్ జోస్యం చెప్పారు. ఈ మేరకు చందానగర్ డివిజన్ పరిధి గొల్లపల్లి రాంరెడ్డి గార్డెన్ వద్ద బిజెపి నాయకులు, కార్యకర్తలు ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా శేర్లింగంపల్లి డివిజన్ పరిధి నుండి మునుగోడు భారీ బహిరంగ సభకు తరలిన నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి యోగానంద్ మాట్లాడారు. గులాబీ దండు తిమ్మిని బమ్మిచేసినా… ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినా… తుపాకి రాముని మించి మాటల తూటాలను పేల్చినా మునుగోడు ప్రజలంతా బిజెపిని ఆదరించి కమలాన్ని వికసింప చేస్తారని అన్నారు. మునుగోడు ఉపా ఎన్నికతో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ పతనం స్టార్ట్ అవుతుందని, ఇక ఏం చేసినా ప్రజలు కెసిఆర్ కంపెనీని ఆదరించబోరని గజ్జల ధీమాను వ్యక్తం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాకను తెలుసుకున్న గులాబీ మూక ఒకరోజు ముందుగానే మునుగోడు లో సభను ఏర్పాటు చేసుకున్నారంటే, వారు ఎంతటి దుస్థితిలో, భయంలో ఉన్నారు ఊహించవచ్చన్నారు. యావత్ దేశ ప్రజలు బిజెపి నాయకత్వాన్ని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆయా ఎన్నికల్లో ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని యోగానంద్ తెలిపారు. తెలంగాణ ప్రజలు గులాబీ గూడుపుఠానికి రెండు పర్యాయాలు మోసపోయి ప్రతి వ్యక్తి తలకు లక్ష రూపాయల పైచిలుకు అప్పును మూట కట్టుకున్నారని, మరో మారు టిఆర్ఎస్ పార్టీని ఆదరించే స్థితిలో లేరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న మునుగోడు ఉపఎన్నికలో దుబ్బాక, హుజురాబాద్ లో ఏంజరిగిందో మునుగోడులోను అదే జరుగుతుందని, టీ.ఆర్.ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలోఅభివృద్ధి జరుగుతుందన్నది అక్షర సత్యం అన్నారు. మునుగోడు బహిరంగ సభకు రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, బుచ్చి రెడ్డి, కాంచన కృష్ణ, రాజు శెట్టి కురుమ, గొల్లపల్లి రాంరెడ్డి, మహిపాల్ రెడ్డి, మారం వెంకట్, బొబ్బ నవతా రెడ్డి, రాకేష్ దుబే, జీ. శ్రీనివాస్ రెడ్డి, పవన్, శాంతి భూషణ్ రెడ్డి, బీమని విజయ లక్ష్మి, కృష్ణవేణి స్వాతి, శివ కుమార్ వర్మ, సైఫుల్ల ఖాన్, వేణు గోపాల్, సత్య కుర్మా, సి. బాలరాజు,పి.కౌసల్య, బీ. సత్యనారాయణ, జే. శ్రీకాంత్, సాయి వెంకట్ గౌడ్ తదితరులు బయలుదేరారు.