ముమ్మరంగా మిషన్‌ కాకతీయ పనులు

చెరువుల పునరుద్దరణతో పెరగనున్న ఆయకట్టు
జనగామ,మే29(జ‌నం సాక్షి): మిషన్‌ కాకతీయ నాలుగోశ  పనులు పూర్తయితే అదనంగా మరో 3,944 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరనుంది. ఇదే సమయంలో చెరువు మట్టిని రైతులు తమ పొలాలు, చెలకల్లోకి తరలిస్తుండడంతో భూసారం పెరుగుతోంది. ఎరువుల వాడకం తగ్గి దిగుబడులు పెరుగుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈసారి మండువేసవిలోనూ చెరువులను గోదావరి జలాలతో నింపి, యాసంగి పంటలకు సాగునీరు అందిస్తున్నారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ నాలుగో విడత పనులు జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ, మరమ్మతు పనులు సత్ఫలితాలనిస్తున్నాయి.  నాలుగో విడతలో 168చెరువుల పునరుద్ధరణకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 127 చెరువులకు పరిపాలనా అనుమతులు రాగా 126 చెరువులకు టెండర్ల పక్రియ పూర్తయింది. ఇందులో సుమారు 81చెరువుల పనులు పూర్తయ్యాయి.  మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణ, మరమ్మతుల కారణంగా చెరువల కింద ఆయకట్టు రైతులకు భరోసా దక్కింది. ఈ వర్షాకాలంలోపు పూర్తిచేసే లక్ష్యంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు మిషన్‌ కాకతీయ పథకం కింద మూడు విడతల్లో పూర్తయిన చెరువులు, చెక్‌డ్యాంలు, కట్టల మరమ్మతులు, పునరుద్ధరణ పనులు ఎగువ ప్రాంత జనగామ జిల్లాలో సత్ఫలితాలనిస్తున్నాయి.జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి 456 చెరువుల పనులు చేపట్టారు. నాలుగో విడతలో అధికారులు 168 చెరువులకు ప్రతిపాదనలు పంపగా అందులో 127 చెరువులకు పరిపాలన అనుమతులు వచ్చాయి.  మిషన్‌ కాకతీయ నాలుగో విడత పనుల కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.3252.2లక్షల నిధులు మంజూరు చేసింది.  చెరువుల పునరుద్ధరణ పనుల్లో భాగంగా కట్టలు పటిష్టం చేయడం, కాల్వలు, తూముల మరమ్మతులు, పూడిక తొలగించడంతో జనగామ జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి నీరుచేరి జలకళ సంతరించుకుంది. కొన్ని చెరువులు, వర్షాలతో సగం మేరకు నీళ్లు చేరితే వర్షపాతం తక్కువగా నమోదైన జనగామ, బచ్చన్నపేట మండలాల్లో దేవాదుల రిజర్వాయర్ల ద్వారా చేరుతున్న నీటితో చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది.దిగువనున్న చిన్న తరహా కుంటల్లోకి గోదారి జలకళ రావడంతో రైతు లు, గ్రామస్తుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జనగామ వంటి ఎగువప్రాంతంలో బీడు వారిన చెరువులు, కుంటలకు జలకళ రావడంతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. గోదావరి జలాలతో తమ గ్రామాల చెరువులు, కుంటలు నిండి మత్తడి పోయడం మిషన్‌ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ ఫలితమని రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మిషన్‌ కాకతీయ కింద చెరువుల పూడికతీతతో రైతులు రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుతోంది.