ముష్కరుల అంతానికి ఐక్యంగా పోరాడాలి

– ప్రపంచ దేశాల పిలుపు
శ్రీనగర్‌, ఫిబ్రవరి15(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన అమెరికా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత్‌తో కలిసి
పోరాడుతామని ప్రకటించింది. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్‌, జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. ఉగ్రదాడిని హేయమైన చర్యగా అభివర్ణించిన ఆస్టేల్రియా.. ఉగ్రపోరులో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.  బంగ్లాదేశ్‌, శ్రీలంకలు అమరుల కుటుంబాలకు తమ సానుభూతిని ప్రకటించాయి. ఉగ్రదాడిని ఐరాస ప్రధాన కార్యదర్శి తీవ్రంగా ఖండించారు. అమరుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ఆయన.. జై షే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ మసూర్‌ అజార్‌పై భారత్‌ ప్రతిపాదించిన నిషేధానికి ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
దోషులకు శిక్ష తప్పదు – పుతిన్‌
కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని భారత్‌ చిరకాల మిత్రదేశమైన రష్యా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ సందేశం పంపారు. జమ్మూకశ్మీర్‌లో భారత జవాన్లపై జరిగిన ఉగ్రదాడి దిగ్భాంతికి గురిచేసింది. ఈ దాడిలో జవాన్లు ప్రాణాలు కోల్పోవడం విచారకరమన్నారు. ఈ క్రూరమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఈదాడి చేసినవారు, చేయించినవారు కచ్చితంగా ఫలితం అనుభవిస్తారన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే చర్యల్లో భారత్‌తో కలిసి మరింత ముందడుగు వేస్తామని మరోసారి చెబుతున్నామని, ఈ కష్ట సమయంలో భారత్‌కు రష్యా అండగా ఉంటుందని, ఉగ్రదాడిలో గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామంటూ పుతిన్‌ సందేశం పంపారు.
ఉగ్రదాడి వెనక ఐఎస్‌ఐ హస్తం ఉందా?
భారత్‌లో జరిగిన ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటికే ఉగ్రవాద సంస్థ జై షే మహమ్మద్‌ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి వెనక పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉన్నట్లు అమెరికాకు చెందిన పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉగ్ర కార్యకలాపాల మద్దతుకు స్వస్తి పలకడానికి పాక్‌పై అమెరికా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందని మాజీ సీఐఏ అధికారి బ్రూస్‌ రీడెల్‌ తెలిపారు. పాక్‌ మూలాలున్న జై షే మహ్మద్‌ తనకు తానుగా బాధ్యత వహించడం చూస్తే ఐఎస్‌ఐ పాత్ర ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. ఈ ఘటన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత దాడితో పాకిస్థాన్‌లో ఉగ్రకలాపాలు కొనసాగుతున్నట్లు అర్థమవుతోందని ఒబామా ప్రభుత్వంలో భద్రతా విభాగంలో పనిచేసిన అధికారి అనీష్‌ గోయెల్‌ అనుమానం వ్యక్తంచేశారు. జై షే మహ్మద్‌ దాడికి బాధ్యత ప్రకటించుకోవడం బట్టి చూస్తే భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టడంపై ఇమ్రాన్‌ఖాన్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఘటనపై స్పందించిన మరికొంత మంది అధికారులు.. భారత్‌లో ఉగ్రదాడికి నిరసగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మద్దతు స్వాగతించదగినదే అయినప్పటికీ.. ఉగ్రవాద నిర్మూలనకు అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.