మూడు నినాదాలతో ప్రజల ముందుకు..
` ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే..
` బిజెపిని ఓడిరచే శక్తులకు మద్దతిస్తాం
` రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవనివ్వం
` ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల : తమ్మినేని
హైదరాబాద్ బ్యూరో, నవంబర్ 5 (జనంసాక్షి):ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులేననీ, సీపీఐ(ఎం) పార్టీ అభ్యర్థులను ఆదరించి, ఎన్నికల్లో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎంబీ భవన్ లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, మల్లు లక్ష్మి, టి సాగర్, ఎండీ అబ్బాస్ తో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 14 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో మూడు స్థానాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అనంతరం ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి తగిన విధంగా కృషి చేస్తామనీ, వారి ప్రయోజనాలు కాపాడే విధంగా పోరాడుతామని ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చినట్టు వివరించారు. మూడు నినాదాలతో సీపీఐ(ఎం) ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు పోతుందని చెప్పారు. మొదటిది సీపీఎం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఇవ్వండీ’ అని అడుగుతామన్నారు. అలా ప్రాతినిధ్యం ఇస్తే కార్మికులు, రైతులు, వ్యవసాయకూలీలు మహిళలకు, బడుగు,బలహీన వర్గాలకు, విద్యార్థులు, యువకులు, దళితులు, గిరిజనులు వంటి సామాన్యుల హక్కుల కోసం చట్ట సభల్లో పోరాడుతుందన్నారు. భవిష్యత్ పోరాటాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. గతంలో శాసన సభలో పార్లమెంట్లో కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్రకు గణమైన చరిత్ర ఉందని వివరించారు. కమ్యూనిస్టులు బలంగా చట్టసభల్లో ఉన్న కాలంలోనే ఉపాధి హావిూ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల చట్టాలచ్చాయన్నారు. ఆర్థిక సంస్కరణల్లో ప్రయివేటీకరణకు పెద్ద పీట వేయకుండా అడ్డుకట్ట వేసింది కమ్యూనిస్టులేనన్నారు. ఎల్బీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల్ని, కార్మికులను కాపాడే పోరాటాలు నిర్వహించామన్నారు. ఆ రకంగా కమ్యూనిస్టుల పోరాట చరిత్ర మరపలేనిదన్నారు. ఆ పోరాట చరిత్రను తెలంగాణ ప్రజలు మననం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే రాబోయే కాలంలో శాసన సభలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ప్రజల ముందుకు పోతున్నామని చెప్పారు. రెండో అశంగా వామపక్ష అభ్యర్థులను బలపర్చాలని విజ్ఞప్తి చేశారు. వామపక్ష ఐక్యతను దృష్టిలో ఉంచుకుని సీపీఐకి కాంగ్రెస్తో పొత్తు ఉన్నప్పటకీ ఆ పార్టీ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం తమ అభ్యర్థులను పోటీ పెట్టబోదని స్పష్టం చేశారు. వామపక్ష్మ, లౌకిక, ప్రజాస్వామిక, సామాజిక, పోరాడే శక్తులు, ప్రజలకు స్నేహితులుగా ఉ న్నటువంటి వాళ్లతో కలిసి పొత్తులు, సర్దుబాట్లు చేసుకోవటానికి కృషి చేస్తామని చెప్పారు. మూడోది.. బీజేపీ ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్నదనీ, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదనీ, నియంతృత్వ చట్టాలను తీసుకొస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులన్నీ ఆదాని, అంబానీ లాంటి కార్పొరేట్ కుబేరులకు కట్టబెడుతున్నదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీని గద్దెదించటం అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ఆ పార్టీ చెప్పినట్టు అధికారంలోకి వచ్చే పరిస్థితి ప్రస్తుతం లేకపోయినప్పటికీ.. గెలవగలిగే రెండు మూడు స్థానాల్లోనైనా.. ఆ పార్టీని గెలవకుండా చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. బీజేపీ భావాజాలాన్ని ప్రజల మనుసుల్లోనుంచి తొలగించేందుకు వివిధ రూపాల్లో ప్రచారం నిర్వహిస్తామన్నారు.
పొత్తుల విషయంలో కాంగ్రెస్కు స్పష్టత లేదు..
పొత్తుల విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. వారు ఇస్తామన్న సీటు కూడా ఇవ్వకుండా దాటవేస్తున్నారన్నారు. ఒక్కో సీటు ఇస్తామనీ, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినట్టుగా సీపీఐ ద్వారా తెలిసిందన్నారు. పెద్దలు జానారెడ్డి కూడా ఫోన్ చేశారన్నారు. అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలోకి పోయేందుకు సిద్దమవుతున్నారని చెప్పారు.
అభ్యర్థులు వీరే..
భద్రాచలం (ఎస్టీ) ` కారం పుల్లయ్య, అశ్వారావుపేట (ఎస్టీ) ` పిట్టల అర్జున్, పాలేరు ` తమ్మినేని వీరభద్రం, మధిర (ఎస్సీ) ` పాలడుగు భాస్కర్
వైరా (ఎస్టీ) ` భూక్యా వీరభద్రం,ఖమ్మం ` ఎర్ర శ్రీకాంత్,సత్తుపల్లి (ఎస్సీ) ` మాచర్ల భారతి,మిర్యాలగూడ ` జూలకంటి రంగారెడ్డి,నకిరేకల్ (ఎస్సీ) ` చినవెంకులు,భువనగిరి ` కొండమడుగు నర్సింహ,జనగాం ` మోకు కనకారెడ్డి,ఇబ్రహీంపట్నం ` పగడాల యాదయ్య,పటాన్‌చెరు ` జె. మల్లికార్జున్,ముషీరాబాద్ ` ఎం. దశరథ్,