మృతుల సంఖ్యను..  తెలుసుకొనే హక్కు ప్రజలకుంది


– కేంద్రం ఎంతమంది చనిపోయారో స్పష్టత ఇవ్వాలి
– సొంతపత్రిక సామ్నాలో పేర్కొన్న శివసేన
ముంబయి, మార్చి5(జ‌నంసాక్షి) : ఉగ్ర స్థావరాలపై దాడి సమయంలో చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యను ఒకరు ఒక విధంగా, మరొకరు ఒక విధంగా తెలపడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని, ఉగ్రవాదుల ఎంతమంది చనిపోయారనే విషయాన్ని తెలుసుకునే హక్కు దేశ ప్రజలకుందని శివసేన అధికార ప్రతిక సామ్నాలో కేంద్రానికి సూచించింది. ప్రభుత్వం ఈ గందరగోళానికి తెరదించేలా ఆ సంఖ్యను బహిర్గతం చేయాలని సూచించింది. దీనివల్ల భద్రతా బలగాల సామర్థ్యాన్ని తగ్గించినట్లు కాదని శివసేన పేర్కొంది. మన భద్రతా బలగాలు చేసిన దాడులతో శత్రువులకు ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకూ వైమానిక దాడులపై చర్చలు కొనసాగుతాయని, దీంతో పుల్వామా దాడికి ముందు ప్రతిపక్షాలు లేవనెత్తిన అనేక అంశాలు తెరమరుగయ్యాయని చెప్పింది. రఫేల్‌ వివాదం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం లాంటి అంశాలు పక్కదారి పట్టాయని, 300కిలోల ఆర్డీఎక్స్‌ ఎక్కడి నుంచి వచ్చింది? దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అన్న అంశాలపైనే చర్చలు నడుస్తాయన్నారు. దాడుల నేపథ్యంలో రైతుల సమస్యలు, రామ మందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 లాంటి అంశాలపై చర్చ లేకుండా పోయిందని పేర్కొంది. హతమైన ఉగ్రవాదుల సంఖ్యను బహిర్గతం చేయాలన్న డిమాండ్‌ కేవలం ప్రతిపక్షాలది మాత్రమే కాదని, ప్రపంచ విూడియా కూడా దీనిపై వివరణ కోరుతోందని రాసుకొచ్చింది.