మెడికల్‌లో ఆత్మహత్యలపై ఆందోళన
మెడికల్ కాలేజీ ముందు ఎస్‌ఎఫ్‌ఐ ధర్నా
గీతిక ఆత్మహత్యపై ముమ్మర దర్యాప్తు
తిరుపతి,ఆగస్ట్13(జనం సాక్షి ): తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. విద్యార్థుల చదువులపై అధిక ఒత్తిడి తెస్తున్న కాలేజి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పద్మావతి మెడికల్ కాలేజి ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి సంబంధించి 3 రోజుల క్రితమే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం విద్యార్థినికి స్విమ్‌లో చికిత్స అందిస్తున్న డాక్టర్లు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాలేజిలో చదువుల ఒత్తిడి భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సూసైడ్ నోట్‌లో పేర్ల ఆధారంగా దర్యాప్తు
సంచలనం సృష్టిస్తోన్న మెడికో గీతిక ఆత్మహత్య కేసులో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో బ్యాంకు ఉద్యోగి పేరు, ఓ మెడికో పేరును గీతిక రాసినట్లు తెలుస్తోంది. పేర్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఎస్వీ మెడికల్ కాలేజీ విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటంతో మెడికోల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. వేధింపుల వల్లనో, వ్యక్తిగత కారణాల వల్లనో బలవన్మరణాలకు పాల్పడుతూ ఉండటం మెడికల్ కాలేజీతో పాటు తిరుపతిలోనూ కలకలం రేపుతోంది. తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని గీతిక(19) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వైద్య అధ్యాపకులు వేధిస్తున్నారంటూ సరిగ్గా నాలుగురోజుల క్రితం పీజీ వైద్య విద్యార్థిని శిల్ప ఆత్మహత్య చేసుకోవడంతో కలత చెందిన వైద్య విద్యార్థులు ఆందోళన బాట పట్టడం, ప్రొఫెసర్ల సస్పెన్షన్, బదిలీల రభస జరుగుతుండగానే మరో వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం తిరుపతిలో సంచలనంగా మారింది. అయితే స్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం విద్యార్థిని గీతిక ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక ఆధారాన్ని సేకరించారు. శివజ్యోతి నగర్ లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న గీతిక గదిలో పోలీసులకు ఆత్మహత్య లేఖ లభ్యమైంది. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె లేఖలో పేర్కొంది. వివాహం చేసుకున్న భర్తతో కలిసి ఉండలేక, తన తల్లి ఇష్టానికి అనుగుణంగా అతనితో విడిపోయి ఉండలేక దిక్కుతోచని పరిస్థితుల్లో తనువు చాలిస్తున్నట్లు గీతిక ఆ లేఖలో పేర్కొంది. వారం క్రితం ఇదే కళాశాలకు చెందిన పీజీ వైద్యవిద్యార్థిని డాక్టర్ శిల్ప ఆత్మహత్య కేసులో వేధింపుల కోణం ఉన్నందున గీతిక విషయంలోనూ ఇదే అనుమానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ఈ లేఖ వాటిన్నంటినీ పటాపంచలు చేసింది. పూర్తిగా వ్యక్తిగత కారణాలతో, వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలతో తనువు చాలిస్తున్నట్లు గీతిక పేర్కొనటంతో ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.