మెదక్ జిల్లా ఔనత్యాన్ని చాటి చెప్పే విధంగా జిలాల్లో మూడు రోజుల పాటు ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను
మెదక్, సెప్టెంబర్ 18, 2022
జనం సాక్షి ప్రతినిధి మెదక్
మన భాష, మన సంస్కృతి, మెదక్ జిల్లా ఔనత్యాన్ని చాటి చెప్పే విధంగా జిలాల్లో మూడు రోజుల పాటు ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహించుకున్నామని, ఇట్టి కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాలలో భాగంగా ఆదివారం స్థానిక ద్వారకా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలలో నరసాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, ఉపాద్యాయులు ,విద్యార్థులతో కలసి పిల్లలతో ఆడిపాడి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించారు. విద్యార్థులు పోతారాజుల వేషధారణలతో, బతుకమ్మ, బోనాలు పాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు .
ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పట్టణాలలో , గ్రామాలలో, ప్రజలందరిలో జాతీయ భావం పెంపొందించడం జరిగిందన్నారు. మెదక్ జిల్లాకు బీసీ మహిళ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్దించిన ఏడాది తరువాత, రాచరిక వ్యవస్థ నుండి విముక్తి పొంది తెలంగాణ దేశంలో అంతర్భాగమై నేటికీ 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ప్రజలలో స్ఫూర్తిని రగిల్చడానికి జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను మూడు రోజుల పాటు రాష్ట్రమంతటా గొప్పగా నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని గమనించి 14 సంవత్సరాలు పోరాటం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు. సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ గా మార్చాలనే సంకల్పంతో గత 8 సంవత్సరాల నుండి దేశంలో ఎక్కడా లేని విధముగా రైతుబంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్ అందించడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని అన్నారు. ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 సంవత్సరాలకు తగ్గిస్తూ అర్హులందరికీ పింఛన్లు అందిస్తున్నారని, పేదింటి ఆడబిడ్డ పెళ్లలకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ ద్వారా 1,00,116 రూపాయలు అందిస్తున్నారని అన్నారు. మిషన్ కాకతీయ క్రింద చెరువులను పునరుద్ధరించి సాగునీరందించడంతో పాటు మిషన్ భగీరథ క్రింద ఇంటింటికి కుళాయి నీళ్లు అందిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న విద్యుత్ సమస్యను అధిగమించి ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం 160 మెడికల్ కాలేజీలు ఇచ్చినప్పటికీ తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో పాలించిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతుబంధు, రైతు బీమా ,కల్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్ వంటి పథకాలను ఇవ్వాలన్న ఆలోచన లేదన్నారు. యాసంగిలో పండిన పంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది గురి చేసింది అన్నారు . సింగరేణి, రైల్వే ,ఎల్ఐసి ,బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థలను ప్రైవేటీకరణ చేసిందని, కరెంటును కూడా ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. బోర్ల కాడ విద్యుత్ మీటర్లు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వం పంపిన జీవోను తెలంగాణలో అమలు చేయమని అసెంబ్లీలో తీర్మానం చేసి తిరిగి కేంద్రాన్ని పంపడం జరిగిందని ఆమె అన్నారు.
కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జాతీయ భావం పెరిగి అందరిలో చైతన్యం వచ్చిందన్నారు. విద్యార్థులలో జాతీయతత్వాన్ని పెంపొందించామని అన్నారు. ఎస్టీ లకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకుంటూ గిరిజనులలో గొప్ప సంకల్పం కలిగించిందని అన్నారు.
అనంతరం 12 మంది స్వాతంత్య్ర సమరయోధులను ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్ర పాల్ లు శాలువాలతో సన్మానించారు. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులను, సాంస్కృతిక సారధి కళాకారులను, వజ్రోత్సవాలలో పాల్గొన్న కూడా సన్మానించారు.
ఈ సందర్భంగా మెదక్ నియోజక వర్గంలోని 105 మంది లబ్దిదారులకు 39 లక్షల కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను, 69 మందికి 31 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి (మెడికల్ రీ ఇంబర్సిమెంట్ ) చెక్కులను అందజేశారు. తదుపరి ఎస్.టి. లకు 10 శాతం రిజర్వేషన్ కల్పించుటకు సాహసోపేత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పద్మ దేవేందర్ రెడ్డి, జెడ్.పి . వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, తదితరులు పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్.పి . వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు చంద్ర గౌడ్, ఆర్.డి.ఓ. సాయిరాం, డీఈఓ రమేష్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, ఏం.ఈ.ఓ. నీలకంఠం, ఏం.పి పి , కౌన్సిలర్లు, సర్పంచులు, విద్యార్థిని, విద్యార్థులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు