మేఘాలయ చేరుకున్న రెస్క్యూ సిబ్బంది

నీటిని తోడే పనిలో హైపవర్‌ ఇంజన్లు
గువహటి,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  మేఘాలయలోని జయంతియా బొగ్గుగనుల్లో చిక్కుకుపోయిన 15మంది కార్మికులను కాపాడేందుకు ఒడిశా నుంచి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది ఈరోజు మధ్యాహ్నానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారితో పాటు తీసుకెళ్లిన పది హైపవర్‌ పంపుల సాయంతో ఇప్పటికే నీటిని తోడే పనులు ప్రారంభించారు. ఒడిశాకు చెందిన 21మంది సిబ్బందికి మేఘాలయ చేరుకోవడానికి 24 గంటల సమయం పట్టింది. సవిూపంలోని లిటిల్‌ నది గనిలోకి పెద్ద మొత్తంలో చేరిన నీటిని పంపుల ద్వారా బయటకు తీస్తున్నారు. గనిలోని కార్మికులను బయటకు తీసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, విశాఖపట్నం నుంచి వెళ్లిన 15 మంది గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
డిసెంబరు 13న అక్రమంగా బొగ్గుగనులోకి కార్మికులు ప్రవేశించగా.. సవిూపంలోని లిటిల్‌ నదిలోని నీళ్లు గనిలోకి ప్రవేశించి దాన్ని ముంచెత్తింది. 15 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. సహాయక చర్యలకు కోల్‌ ఇండియా కూడా సహకరిస్తోంది. తొలుత ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తక్కువ పవర్‌ పంపులతో నీటిని తోడినప్పటికీ ఫలితం లేకపోయింది. పెద్ద మొత్తంలో వరద నీరు గనిలోకి వస్తుండడంతో వాటితో ప్రయోజనం కలగలేదు. ఏదైనా అద్భుతం జరిగి తమ వాళ్లు ప్రాణాలతో బయటపడాలని గనిలో చిక్కుకుపోయిన కార్మికుల కుటుంబసభ్యులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. కేవలం దేవుడి దయ, ఏదో పెద్ద అద్భుతం జరిగితేనే వాళ్లు ప్రాణాలతో బయటపడతారని రాష్ట్ర మంత్రి ఒకరు అన్నారు. గనిలో చిక్కుకుపోయి రెండు వారాలు దాటిపోవడం, లోపలికి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడం, వారికి ఆహారం లేకపోవడం వల్ల కార్మికులు ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 16రోజులుగా సహాయక చర్యలు చేపడుతుండగా కేవలం 3 హెల్మెట్లు మాత్రమే లభ్యమయ్యాయి. గల్లంతైన వారి ఆచూకీ ఏమాత్రం తెలియలేదు.