మేడారంలో పరుచుకోనున్న పచ్చదనం

వరంగల్‌,ఫిబ్రవరి20  ( జ‌నంసాక్షి) : మేడారం ఇక పచ్చదనాన్ని సంతరించుకోబోతోంది. వచ్చేయేడు జాతర నాటికి పచ్చని మొక్కలతో స్వాగతం పలికేలా తీర్చిదిద్దాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇక్క డచెట్లను నరికివేతను అరికట్టడంతో పాటు కొత్తగా వేలాది మొక్కలను నాటి పచ్చదనాన్ని పెంచాలని నిర్ణయించినట్లు కలెక్టర్‌ వాకాటి కరుణ తెలిపారు. పచ్చని మేడారం కోసం రహదారికి ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల ముందు నీడ నిచ్చే చెట్లను, పొలం గట్లపై టేకు మొక్కలు నాటిస్తామన్నారు. వీటిని రాబోయే రోజుల్లో తొలగించే వీలు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. నాటిన ప్రతి మొక్క వృక్షంగా పెరిగే వరకు సంరక్షణ చర్యలు చేపడతామన్నారు. దీని కోసం ముందుగానే అన్ని శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని చెప్పారు. 18,874 మొక్కలు నాటే ఈ మహత్తర కార్యక్రమానికి గ్రామస్థులు సహకరించాలని కోరారు. హరిత తోరణం కార్యక్రమం అమలులో భాగంగా  ఆమె మేడారం సందర్శించి స్థానిక ప్రజలతో చర్చించారు.  నార్లాపురం ఆర్టీసీ బస్టాండ్‌, జంపన్నవాగు, చిలకలగుట్ట, ఆలయం పరిసరాల్లో పర్యటించారు. స్థానిక అధికారులతో మొక్కలు నాటే విషయమై చర్చించారు. గ్రామస్థులతో సమావేశమమై వారి అభిప్రాయాలు సేకరించారు. గ్రామంలోని ఖాళీ స్థలాలు, రహదారులు, పొలం గట్ల వెంట మొక్కలు నాటడానికి స్థానికులందరూ అంగీకరించారు. మహాజాతరకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. ఎంతో ప్రాధాన్యమున్న మేడారంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని నిర్ణయించామన్నారు. అలాగే తెలంగాణ హరిత హారం పథకం ద్వారా వివిధ శాఖలకు నర్సరీల పెంపకానికి ఇచ్చిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణ పేర్కొన్నారు.  తెలంగాణ హరిత హారం ప్రగతిపై వివిధ శాఖల అధికారులతో సవిూక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు డివిజన్‌లో 2వేల ఎకరాలలో మొక్కల పెంపకానికి అనువైన స్థలాలను ఎంపికచేయాలని ఐటీడీఏ పీవో సుధాకర్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీని ఆదేశించారు. హరిత హారం నిరంతర కార్యక్రమమని, మార్చి ఒకటిలోపు నర్సరీలు పూర్తిచేయాలని సూచించారు. 15నాటికి లబ్దిదారుల ఎంపిక కూడా పూర్తిచేయాలని సూచించారు. ఏప్రిల్‌లో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పారు. నగరంలో కుడా, కార్పొరేషన్‌ అధికారులు సంయుక్తంగా చేపట్టాలని కోరారు. కార్పొరేషన్‌ పరిధిలో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని ఆదేశించారు. విలీన గ్రామాలలో విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.