మేమంటే అంత భయమెందుకు?

BSP Supreemo Mayawati addressing press conference at her official residence in Lucknow on Saturday. Express Photo by Vishal Srivastav. 24.03.2018.

– మా కూటమిని చూస్తే.. భాజపాకు వణుకు పడుతుంది
– అందుకే అఖిలేష్‌ను అడ్డుకున్నారు
– భాజపా కుట్రలను తిప్పికొడతాం
– బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు
లఖ్‌నవూ, ఫిబ్రవరి12  (జ‌నంసాక్షి) యూపీలో బీఎస్పీ, సమాజ్‌వాది పార్టీ కూటమిని చూసి భాజపా భయపడుతుందని, అందుకు నిదర్శనం అఖిలేష్‌ను అడ్డుకోవటమేనని బీఎస్పీ అధినేత్రి, మాజీ సీఎం మాయావతి అన్నారు. అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్తోన్న ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ను విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్న విషయంపై రాజకీయ రగడ మొదలైంది. భారతీయ జనతా పార్టీ తీరుపై ఎస్పీ మిత్రపక్షం బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ-ఎస్పీ కూటమిని చూసి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్ర సర్కారు భయపడుతోందా అని ఆమె ప్రశ్నించారు. అందుకే, మా కూటమి రాజకీయ కార్యక్రమాలను ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలతో భాజపా ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. భాజపా ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని అన్నారు. ఇది చాలా దురదృష్టకరమని, ప్రజాస్వామ్యరహిత చర్య.. వారి తీరుపై దీనిపై అన్ని స్థాయిల్లో పోరాడాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనను సమాజ్‌ వాదీ పార్టీ ఖండించింది. ఆ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ విూడియాతో మాట్లాడుతూ… ‘ఈ విషయంలో నేరు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌నే నిందించాల్సి ఉంటుందన్నారు. ఆ కార్యక్రమానికి వెళ్లడానికి అఖిలేశ్‌కు అనుమతి ఉందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఆయనను అడ్డుకున్నారన్నారు. కనీసం అలహాబాద్‌కు వెళ్లనివ్వట్లేదు’ అని వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది – సీఎం యోగి
లఖ్‌నవూ విమానాశ్రయంలో అఖిలేశ్‌ యాదవ్‌ను అడ్డుకున్న ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ స్పందించారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ… ఇటువంటి అరాచక కార్యక్రమాలను సమాజ్‌ వాదీ పార్టీ ఆపేయాలని హితవుపలికారు. అఖిలేశ్‌ తమ విశ్వవిద్యాలయానికి వస్తే శాంతి, భద్రతల సమస్య తలెత్తుతుందని, ఆయనకు అలహాబాద్‌ వర్సిటీ ఇప్పటికే తెలిపిందని, విద్యార్థి సంఘాల మధ్య గొడవలు చెలరేగుతాయని చెప్పిందని, అందుకే ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.