మొక్కల పెంపకం పంచాయితీల బాధ్యత

సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి

కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ,జూలై7(జ‌నం సాక్షి): తెలంగాణ పంచాయతీ రాజ్‌ చట్టం 2018 ప్రకారం ప్రతీ గ్రామ పంచాయతీ తప్పనిసరిగా హరితహారం మొక్కల పెంపకం లక్ష్యాన్ని చేరుకోకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. చట్టం ముఖ్య ఉద్దేశ్యం గ్రామ పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు విధిగా పాటించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇంటికి ఆరు మొక్కల పెంచాలన్నది చట్టంలో పేర్కొన్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా ఈఏడాది వర్షాకాలంలో జిలాల్లోని ప్రతి ఇంటి ఆవరణలో ఆరు మొక్కలు, గ్రామానికి 40వేల మొక్కల పెంపకమే లక్ష్యంగా అధికారులు సమగ్ర ప్రణాళికతో సిద్ధం కావాలని ఆదేశించారు. పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖ సౌజన్యంతో గ్రామ పంచాయతీ స్థాయిలో నర్సరీలు, ప్లాంటేషన్ల పెంపకం, నిర్వహణపై సంబంధిత అధికారులు, సిబ్బందికి రెండురోజుల శిక్షణ ఇచ్చారు. శిక్షణలో అంశాలపై అవగాహన చేసుకున్న అధికారులు కింది స్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, వచ్చే ఏడాది మొక్కల పెంపకం కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక మొదలవుతుందన్నారు. పర్యావరణ సమతూల్యతను కాపాడేందుకు మొక్కల పెంపకం దోహదం చేయడంతోపాటు వర్షపాతం పెరిగి భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ఇంటింటికి ప్రతిఒక్కరు మొక్కలు నాటుకొని సంరక్షించుకోవాలని కోరారు. రానున్న ఏడాది నాటే మొక్కల, పెంపకం నర్సరీల ప్రతిపాదనలపై మండలస్థాయి సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా అధికారులకు సూచించారు.