మోగనున్న మొబైల్ బిల్లుల మోత
కోల్కత్తా : నాలుగంచెల ఏకీకృత పన్ను విధాన నిర్మాణం ఎట్టేకేలకు విడుదలైంది. ఈ నేపథ్యంలో వేటిపై ఎంత భారం పడనుందని కంపెనీలు అంచనావేసుకుంటున్నాయి. జీఎస్టీ విధానం అమల్లోకి వస్తే వినియోగదారుల మొబైల్ బిల్స్ ఎక్కువగా పెరగనున్నాయని తెలుస్తోంది. మొబైల్ కంపెనీలు వారు అందించే సర్వీసులపై పన్ను రేటు పెరగనుందని, దీనికి అనుగుణంగా కంపెనీలు మొబైల్ బిల్లులపై మోత మోగించనున్నాయని సమాచారం.
టెలికాం పరిశ్రమ ప్రస్తుతం 15 శాతం పన్నుల పరిధిలోకి వస్తోంది. అయితే గురువారం జీఎస్టీ మండలి ఆమోదించిన నాలుగంచెల జీఎస్టీ విధానం రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి. టెలికాం పరిశ్రమను 12 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తే, ప్రభుత్వ రెవెన్యూలకు గండికొట్టనుందని, దీంతో ఈ పరిశ్రమను 18 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్లు అంటున్నారు.
వినియోగదారులు చెల్లిస్తున్న నెలవారీ బిల్లు రూ.1000కు అదనంగా రూ.30ల కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నాయి.. అదేవిధంగా పెట్రో ప్రొడక్ట్లపై విధించే పన్ను రేట్లు కూడా టెలికాం కంపెనీలపై ప్రభావం చూపనున్నాయని మాథ్యూస్ చెప్పారు. రైల్వే తర్వాత డీజిల్కు రెండో అతిపెద్ద వినియోగదారిగా టెలికాం రంగం ఉందని పేర్కొన్నారు.