మోడీని తప్పించాలన్నదే ఆ ఇద్దరి లక్ష్యం

పాక్‌, రాహుల్‌ తీరుపై మండిపడ్డ బిజెపి
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భారత రాజకీయాల్లోంచి తప్పించడమే పాకిస్థాన్‌, కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. వారిద్దరి లక్ష్యం అదేనని   భాజపా నేత సంబిత్‌ పాత్రా అన్నారు. రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో జరిగిన అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మోదీ.. పాక్‌-భారత్‌ల మధ్య జరగాల్సిన చర్చలను రద్దు చేశారని  పాకిస్థాన్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్లను పాకిస్థాన్‌ మంత్రి ఫవాద్‌ హుస్సైన్‌ రీట్వీట్‌ చేస్తూ భారత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీనిపై భాజపా నేత సంబిత్‌ పాత్రా  విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, పాక్‌లపై విమర్శలు చేశారు. ‘భారత్‌లో రాహుల్‌ గాంధీ గొప్ప నాయకుడు కావాలని కొందరు కోరుకుంటున్నారు. వారు ఎవరో కాదు.. పాకిస్థాన్‌ నాయకులే. అవినీతి, వారసత్వ, బుజ్జగించే రాజకీయాలు చేసే వారికి వారు మద్దతు పలుకుతున్నారు’ అని ఆయన ఆరోపించారు. పేదవారు, దళితులు, వెనకబడిన తరగతుల వారు, సామాన్యులు అందరూ మోదీకి మద్దతు తెలుపుతున్నారు. ఆయనను రాజకీయాల నుంచి ఎవ్వరూ తొలగించలేరు. మోదీ పట్ల పాకిస్థాన్‌ నాయకులు, కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. వారి లక్ష్యం ఒక్కటే.. మోదీని రాజకీయాల్లోంచి తొలగించడమే వారి ధ్యేయం’ అని సంబిత్‌ పాత్రా వ్యాఖ్యానించారు. గతంలో భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ విమర్శిస్తే ఆ సమయంలో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ.. పాక్‌ తీరును దుయ్యబట్టారని ఆయన గుర్తుచేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన చూపించారు. కానీ కాంగ్రెస్‌ మాత్రం ఆ పని చేయట్లేదని విమర్శించారు. మోదీయే ప్రధానిగా కొనసాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కానీ, పాక్‌ మాత్రం భారత ప్రధానిగా రాహుల్‌ గాంధీ ఉండాలని కోరుకుంటోందని
ఆయన అన్నారు.