మోడీ నిరంకుశంపై అంకుశం

ఏకమైన దేశ రాజకీయ పార్టీలు
మొన్న మమత,నేడుచంద్రబాబుల దీక్ష
విపక్షాల ఐక్యతకు కలసి వస్తున్న కాలం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఇప్పుడు విపక్షాలన్నీ ఒక్కట య్యాయి. మొన్నకోల్‌కతా, నేడు ఢిల్లీ వేదికగా మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడుల చేసిన దీక్షలతో విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఇందులో ఎవరి స్వార్థం వారిదే అయినా మోడీకి వ్యతిరేకంగా అంతా ఏకమయ్యారు.  మోడీ ప్రధాని అయ్యాక కేంద్ర రాష్ట్రాల సంబంధాలు పునరుద్దరించబడి ఓ ఆరోగ్యకర వాతావరణం ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. సరికదా రాష్ట్రాలు,కేంద్రాల మధ్య సయోధ్య లేకుండా పోయింది. హావిూలను అమలు చేయకపోగా ఎదురుదాడితో మోడీ కాలం వెళ్లదీసారు.
ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి పుణ్యమా అని దేశంలో ఇప్పుడు ఘర్షణ రాజకీయాలు నడుస్తున్నాయి. దేశంలో భారతీయ జనతాపార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదన్న నరేంద్ర మోదీ పోకడలు విపక్షాలను ఏకం చేయగలిగాయి. గతంలో సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ పార్టీ కూడా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను తరుచుగా రద్దు చేసేది. నాటి కాంగ్రెస్‌ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలన్నీ ఏకమ య్యాయి. ఇప్పుడు మళ్లీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ నిర్నయాలతో విపక్షాలన్నీ జట్టుకట్టాల్సి వచ్చింది. రాజ్యవిస్తరణ కాంక్షకు అడ్డుగా ఉంటున్న విపక్షాలను కేసులలో ఇరికించడమే పనిగా నరేంద్ర మోదీ వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యాపించింది. దీంతో తనకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న మహా కూటమిలోని నాయకులందరూ దోపిడీదారులని ప్రధాని నరేంద్ర మోదీ మొన్న
లోక్‌సభలోనే ప్రకటించారు. అవినీతి పరులంతా జట్టుకుట్టారని అన్నారు.తానొక చాయ్‌వాలాననీ, పేదవాడిననీ, బీసీననీ చెప్పుకొని గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోదీ వ్యవహార శైలి మారిపోయింది. ప్రతిపక్షాలనే కాకుండా సొంత పార్టీలో కూడా తనకు ఎదురులేకుండా చేసుకోవడం ద్వారా నియంతృత్వ విధానాలను అవలంబి స్తున్నారు. తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకపక్షంగా చేశారు. పెద్దలయిన అద్వానీ, మురళీమనోహర్‌ జోషి లాంటి వారిని పక్కన పెట్టారు. వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతి చేసి పార్టీలో ప్రాధాన్యం లేకుండా చేశారు. ఇవన్నీ కూడా మోడీ నిరంకుశ విధానాలకు నిదర్శనమనడంలో సందేహం లేదు.సొంత పార్టీలో తనను ఎదురించేవారు లేకుండా పోవడంతో విపక్షాలపై ప్రధాని తన దృష్టిని కేంద్రీకరించారు. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కి కూడా ప్రధాని నరేంద్ర మోదీ కొరకురాని కొయ్యగా మారారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే తన పార్టీని ఆయా రాష్ట్రాలలో విస్తరించలేనన్న ఉద్దేశంతో ఒక్కొక్కరిని టార్గెట్‌ చేసుకోవడం మొదలెట్టారు. దీంతో ప్రత్యర్థులకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. అందుకే నరేంద్ర మోదీ ఆహార్యం, ఆయన జీవన శైలి గమనించిన వారికి ఆయనలో పేదరికం కనిపించదు. దీంతో  మోదీ బాధితుల జాబితాలో ఒక్కొక్కరుగా చేరుతూ వచ్చారు. తన నాయకత్వాన్ని ధిక్కరించిన వారిని అణచివేయడానికి ఎంత దూరమైనా వెళతారు. ఈ క్రమంలోనే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం మొదలెట్టారు. అవినీతికి, అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక యోధుడ్ని తానేనని దేశ ప్రజలను నమ్మించడానికే మోదీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. /ూజనీతిజ్ఞుడిగా వ్యవహరించవలసిన ప్రధాని మోదీ సంకుచితంగా వ్యవహరించడం వల్లనే దేశంలో పరిస్థితులు వికటిస్తున్నాయి. ఎమర్జెన్సీ తర్వాత మళ్లీ ఇప్పుడే దేశంలో ప్రతిపక్షాలు ఇంతటి నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నాయి. కేసులు, దర్యాప్తుల పేరిట ప్రత్యర్థులను లొంగ దీసుకునే సంస్కృతికి తెరదీయడం వల్ల దేశంలో రాజకీయ సామరస్యానికి చోటులేకుండా పోయింది. అందుకే చంద్రబాబు,మమతా బెనర్జీలు తిరుగుబాటు చేశారు. వారికి మిగతా పార్లీలు అండగా నిలిచాయి. దీంతో రానున్న కాలంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి.