మోడీ 10నిమిషాలు నాతో చర్చకు సిద్ధమా?

– అక్కడ ఉండలేక పారిపోతావ్‌

– దేశంలో భాజపా ద్వేషాన్ని వ్యాప్తిచేస్తుంది

– దేశంకంటే తామే గొప్ప అనే భావనలో భాజపా ఉంది

– మూడునెలల్లో దేశమే గొప్ప అని వారికి అర్థమౌతుంది

– భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఓడిస్తుంది

– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): దేశ భద్రత విషయంలో నాతో చర్చించేందుకు ప్రధాని మోదీని కనీసం 10

నిమిషాలు ఓ వేదికపై ఉంచండని, ఆయన అక్కడ ఉండలేక పారిపోతారని రాహుల్‌ అన్నారు. గురువారం తమ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌ పాల్గొని మాట్లాడారు. ప్రధానికి ఓటమి భయం పట్టుకుందని అన్నారు. నాలుగున్నరేళ్లలో ప్రజా వ్యతిరేఖ విధానాలతో పాలన సాగించిన మోడీ పట్ల ప్రజలు ఆక్రోశంతో ఉన్నారని అన్నారు. దీనిని గుర్తించి ఎన్నికల సమయంలో ప్రజలకు తాయిళాలు ప్రకటిస్తున్నారని, అయినా అవి మోడీని అధికారంలోకి తేలేవని గుర్తుంచుకోవాలన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీ ఓడిస్తుందని, దేశంలో భాజపా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందన్నారు. ప్రధాని మోదీ ముఖంలో భయం కనపడుతోందని అన్నారు. దేశంలోని ప్రజలను విభజిస్తూ పరిపాలన కొనసాగించలేమని ఆయన ఇప్పుడు తెలుసుకుంటున్నారన్నారు. దేశంలోని వ్యవస్థలు ఏదో ఒక పార్టీకి చెందినవి కాదని, అవి దేశానికి చెందినవని రాహుల్‌ అన్నారు. వాటిని రక్షించడం మన బాధ్యత అని, కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీల బాధ్యత ఇదన్నారు. దేశం కన్నా తామే గొప్ప అని భాజపా భావిస్తోందని, తమ కంటే దేశమే గొప్ప అని మరో మూడు నెలల్లో వారికి తెలుస్తుందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దేశ భద్రత విషయంలో నాతో చర్చించేందుకు ప్రధాని మోదీని కనీసం 10 నిమిషాలు ఓ వేదికపై ఉంచండి.. ఆయన అక్కడ ఉండలేక పారిపోతారని రాహుల్‌ అన్నారు. డోక్లాంలోకి చైనా తమ ఆర్మీని పంపింది. కానీ, మోదీ చైనా ముందు చేతులు కట్టుకుని నించున్నారు. ఈ ఐదేళ్లు ఆయనపై పోరాటం జరిపాక నాకు ఓ విషయం తెలిసింది. ఆయన ధైర్యం లేని వ్యక్తి. ఆయనతో వాదించడానికి ఎవరైనా ఆయన ముందు నిలబడితే అక్కడి నుంచి వెళ్లిపోతారు. మేము మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని తొలగించి రాజ్యాంగబద్ధ వ్యవస్థలను నెలకొల్పుతున్నామని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.