మోదీపై ప్రజల్లో..  ఎలాంటి అనుమానాలు లేవు


– యుద్ధ విమానాలపై ప్రతిపక్షాల డిమాండ్‌ సరికాదు
– రాఫెల్‌ విషయంలో ప్రధానికి మద్దతు పలికిన శరద్‌ పవార్‌
ముంబయి, సెప్టెంబర్‌27(ఆర్‌ఎన్‌ఎ) : ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజల్లో ఎలాంటి అనుమానాలు లేవని, రాఫెల్‌ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి అంటూ ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం సరికాదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ అన్నారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో ¬లన్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈనేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ మాత్రం రాఫెల్‌ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మద్దతు పలికారు. మోదీ ఉద్దేశాలపై ప్రజలెవరికీ ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ఓ మరాఠీ విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్‌ పవార్‌ మాట్లాడుతూ.. ‘యుద్ధ విమానాలకు సంబంధించి సాంకేతిక వివరాలను చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం అర్ధరహితం. యుద్ధవిమానాల ధరలను బహిర్గతం చేయడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని అన్నారు. అయితే మోదీ ఉద్దేశాలపై ప్రజలకు అనుమానాలు ఉంటాయని మాత్రం నేను అనుకోవడం లేదని అన్నారు. అయితే రాఫెల్‌ ఒప్పందంపై రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ చెప్పిన విధానం మాత్రం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించిందని పవార్‌ అన్నారు.