మోదీ కాపలాదారే కాదు దొంగ కూడా..!

– రాఫెల్‌ స్కాంలో మోడీపాత్ర ఉంది
– రక్షణశాఖతో సంబంధం లేకుండా పీఎంవో నేరుగా ఒప్పందం చేసుకుంది
– రాఫెల్‌ ఒప్పందపై జేపీసీతో విచారణ జరిపించాల్సిందే
– కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి8(జ‌నంసాక్షి) : రాఫెల్‌ వ్యవహారం రాజుకుంటూనే ఉంది.. ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్‌ చేస్తూ  ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. రాఫెల్‌ డీల్‌పై ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రధాని నరేంద్ర మోడీ దేశ కాపలాదారుడే కాదు దొంగ కూడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాఫెల్‌ స్కామ్‌లో మోడీ పాత్ర ఉందని ఆరోపించిన ఆయన, రాఫెల్‌ ద్వారా అనిల్‌ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. ఓవైపు ఉన్నతస్థాయి కమిటీ చర్చలు జరుపుతున్నప్పుడు పీఎంవో జోక్యం ఏంటని రాహుల్‌ ప్రశ్నించారు. ఫ్రాన్స్‌తో పీఎంవో నేరుగా
చర్చలు జరిపిందన్న ఆయన… ప్రధాని మోడీ దేశ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రక్షణశాఖతో సంబంధం లేకుండా పీఎంవో నేరుగా ఒప్పందం చేసుకుందన్నారు. రాఫెల్‌ ఒప్పందంపై పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని అబద్ధాలు మాట్లాడారని రాహుల్‌ మండిపడ్డారు. ఈ ఒప్పందంలో ప్రధాని మోడీకి నేరుగా ముడుపులు అందాయని సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు.. అనిల్‌ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని మోడీ బ్రోకర్‌గా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణశాఖ వ్యతిరేకించినా ఎందుకు ఒప్పందం చేసుకున్నారని రాహుల్‌ నిలదీశారు. రాఫెల్‌ డీల్‌ దేశం కోసం కాదు… అనిల్‌ అంబానీ కోసమే అని వ్యాఖ్యానించారు. మోడీ సర్కార్‌ సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించిందన్నారు, పీఎం మోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారమన్‌ పచ్చి అబద్ధాలుచెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్‌ కుంభకోణంపై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.