మోదీ కోడ్‌ను ఉల్లంఘించలేదు

– మోడీ ‘మిషన్‌ శక్తి’ ప్రసంగానికి ఈసీ క్లీన్‌చిట్‌
న్యూఢిల్లీ, మార్చి29(జ‌నంసాక్షి) : ప్రధాని మోడీ ‘మిషన్‌ శక్తి’ పై చేసిన ప్రసంగానికి ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. లోక్‌ సభ ఎన్నికలు సవిూపిస్తున్న వేళ మోడీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘించారా లేదా అనే విషయం తేల్చడానికి ఈసీ ఓ పోల్‌ ప్యానల్‌ ను నియమించింది. ప్రసంగాన్ని పరిశీలించిన అనంతరం మోడీ ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘించలేదని ఈసీ తేల్చి చెప్పింది. అంతరిక్షంలోని శత్రుదేశాల ఉపగ్రహాలను కూల్చివేయగల శాటిలైట్‌ విధ్వంసక క్షిపణి (ఏశాట్‌)ని భారత్‌ బుధవారం విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. భూదిగువ కక్ష్యలో 300 కిలోవిూటర్ల ఎత్తులో తిరుగుతున్న పనిచేయని ఓ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఏశాట్‌ క్షిపణి మూడు నిమిషాల్లో కూల్చివేసిందని ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ వ్యవహారం గత రెండు రోజులుగా దుమారం రేపుతోంది. మోడీ ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘీంచారంటూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు, కమ్యూనిస్ట్‌ పార్టీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ప్రకటనకు ముందు ఈసీని సంప్రదించారా లేదా అని ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఈసీ రంగంలోకి దిగింది. మోడీ ప్రకటనపై ఇప్పటికే రెండు సార్లు సమావేశమైంది. కాగా మోడీ ప్రకటనను ప్రసారం చేసిన దూరదర్శన్‌ తోపాటు ఆల్‌ ఇండియా రేడియోలు తమ సమాధానాన్ని ఈసీకి పంపాయి. మోడీ మాట్లాడిన విషయాలను పరిశీలించేందుకు అటు ఆల్‌ ఇండియా రేడియోతో పాటు దూరదర్శన్‌ లో వచ్చిన వీడియోను పరిశీలించారు. చివరకు ప్రధాని మోడీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించలేదని నిర్ధారించారు.