మోదీ మౌనం ఎందుకు?

– బీఎస్పీ అధినేత్రి మాయావతి
లఖ్‌నవూ, మార్చి5(జ‌నంసాక్షి) : ఉగ్రస్థావరాలపై దాడిలో ఎంతమంది ఉగ్రవాదులను హతమార్చాలో స్పష్టం చేయాలని, ఆ విషయంలో మోదీ మౌనం ఎందుకు వహిస్తున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం సమర్థవంతంగా దాడులు జరిపి, సురక్షితంగా తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు హతమయ్యారన్న విషయంపై మాత్రం ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి (బీఎస్పీ) మాయావతి ఈ విషయంపై మరోసారి విమర్శలు గుప్పించారు. భారత వైమానిక దళం చేసిన దాడిలో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా చెప్పుకొంటున్నారని, అయితే, ఆయన గురువు ప్రధానమంత్రి మోదీ మాత్రం.. హతమైన ఉగ్రవాదుల సంఖ్యపై మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపనిని మోదీ తన గొప్పతనంగా చెప్పుకొంటారని, ఉగ్రవాదులను హతమార్చిన విషయం ఓ శుభవార్తే అని, కానీ, ఈ విషయంలో మోదీ మౌనంగా ఉండడం వెనుక ఉన్న రహస్యం ఏంటీ అని ఆమె తన ట్విటర్‌ ఖాతాలో విమర్శించారు. ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భాజపా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్‌ షా ఈ సందర్భంగా మాట్లాడుతూ… ‘జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాదులపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు హతమయ్యారు’ అని వ్యాఖ్యానించారు. దీనిపైనే మాయావతి స్పందిస్తూ విమర్శలు చేశారు. కాగా, మోదీ ప్రభుత్వ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితిపై మాయావతి మరోసారి ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు. దేశంలో ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు దేశంలోని పేదలు, కూలీలు, రైతులకు అందడం లేదని, ఇది తీవ్ర ఆందోళన చెందాల్సిన విషయమని అన్నారు. జీడీపీ విషయంలో తప్పుడు వివరాలు చెబుతున్నారని ఆమె ఆరోపించారు.