మోసం చేసిందని..
మహిళలను హతమార్చిన వ్యక్తి
– హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాకినాడ, ఆగస్టు28(జనం సాక్షి) : కాకినాడలో ఘోరం ఘటన జరిగింది. తనను మోసం చేసిందని ఓ వ్యక్తి మహిళలను దారుణంగా హతమార్చిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలం ఓడలరేవులో పొనమండ కృష్ణకుమారి(45) అనే మహిళను దుర్గాప్రసాద్ అనే యువకుడు మంగళవారం ఉదయం హత్య చేశాడు. కృష్ణ కుమారి తన కూతురిని దుర్గాప్రసాద్‌కు ఇచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికింది. కాగా… దుబాయిలో ఉన్న దుర్గాప్రసాద్ పలుమార్లు కృష్ణకుమారికి డబ్బులు పంపాడు. ఈ డబ్బులను కాజేయడం, కూతురిని ఇచ్చి పెళ్లిచేయకపోవడంపై కృష్ణకుమారిపై దుర్గాప్రసాద్ కోపం పెంచుకున్నాడు. దుబాయి నుంచి వచ్చిన అనంతరం అదునుకోసం వేచిచూసి మంగళవారం ఉదయం కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అలాగే పీకకోయడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. దుర్గాప్రసాద్ ను అదుపులోకి తీసుకోగా జరిగిన విషయాన్ని తెలియపరిచాడు. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానందని, నేను దుబాయి నుంచి పంపించిన డబ్బులను కాజేసిందని, నన్ను మోసం చేసిందన్న కోపంతో కత్తితో పీక కోసి చంపేశానని దుర్గాప్రసాద్ పేర్కొన్నాడు.