యాదాద్రిపై కుట్ర
` థర్మల్ పవర్‌స్టేషన్ తుది అనుమతుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం
హైదరాబాద్(జనంసాక్షి):నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ (వైటీపీఎస్)కు అవసరమైన అనుమతుల మంజూరులో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ తీవ్ర జాప్యం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ జెన్‌కో ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంతో 2017 జూలైలో వైటీపీఎస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా ఇప్పటికే 73% పనులు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే రూ.29,965.48 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టగా.. ఇప్పటికే రూ.21,837.02 కోట్ల పనులు పూర్తయ్యాయి. నిజానికి వైటీపీఎస్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ, ?క్లెమేట్‌చేంజ్ శాఖ 2017 జూన్ 29న పర్యావరణ అనుమతులిచ్చింది. తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు కూడా ఆ మరుసటి నెల 25న క్లియరెన్స్ ఇచ్చింది. అన్ని రకాల అనుమతులు రావడంతో టీఎస్ జెన్‌కో యుద్ధప్రాతిపదికన పనులను ప్రారంభించారు. అయితే కరోనా మహమ్మారితోపాటు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో రెండు స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవో) వేసిన పిటిషన్ల కారణంగా నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. కేసులు వేసిన ముంబైకి చెందిన కన్జర్వేషన్ యాక్షన్ ట్రస్ట్, విశాఖపట్టణానికి చెందిన సమత సంస్థల కేసులను వాదిస్తున్న న్యాయవాది రిత్విక్‌దత్తాకు అమెరికన్ సంస్థల నుంచి నిధులు వస్తున్నాయనే ఆరోపణలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో విద్యుత్తు కేంద్రానికి సంబంధించిన సివిల్ పనులు చేసుకోవచ్చని, కమిషనింగ్ మాత్రం నిలిపివేయాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ఎన్జీటీ చేసిన పలు సూచనలు చేసింది. ఆయా సూచనలను, అధ్యయనాలను టీఎస్‌జెన్కో తొమ్మిది నెలల్లోనే పూర్తిచేసి, కేంద్రానికి సమర్పించింది. ఈ అధ్యయనాలకు అనుగుణంగా అవసరమనుకుంటే రివైజ్డ్ టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)ను నిర్దేశించిన గడువు (9 నెలలు)లోగా సిద్ధం చేసి, ప్రాజెక్టును ప్రారంభించడానికి పూర్తి అనుమతి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర పర్యావరణ, అటవీశాఖపై ఉన్నది. ఆ గడువు 2023 జూన్ నాటికే ముగిసినప్పటికీ వైటీపీఎస్‌ను ప్రారంభించేందుకు పూర్తిస్థాయి అనుమతులను ఇవ్వడంలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ జాప్యం చేస్తున్నది. వైటీపీఎస్ ప్రారంభానికి అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే అనేకసార్లు టీఎస్ జెన్‌కో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు లేఖలు రాసింది. అంతేకాకుండా 2023 మే 11న కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్ సైతం సమస్యను వెంటనే పరిష్కరించి, అనుమతులు మంజూరు చేయాలని పర్యావరణశాఖ కార్యదర్శి లీనానందన్‌కు లేఖ రాశారు. నాలుగు నెలలైనా పర్యావరణ శాఖ నుంచి స్పందన లేదు. కేంద్రంలోని ఒక మంత్రిత్వ శాఖ రాసిన లేఖను మరో మంత్రిత్వశాఖ పట్టించుకోకపోవడం విడ్డూరం. ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో ఒకేచోట 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించడం బహుశా దేశంలోనే ఇదే ప్రథమం. అంతటి ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ ప్రాజెక్టుకు సంపూర్ణ సహకారం అందించాల్సిన అటవీ, పర్యావరణ శాఖ ఇప్పటికైనా మేల్కొనాలి. దేశవ్యాప్తంగా విద్యుత్తు అవసరాలు, విద్యుత్తు కోతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ప్రారంభానికి బాసటగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది.