యువతను పెడదారి పట్టిస్తోన్న బెట్టింగ్‌లు
ఉన్నతవర్గాల పిల్లలే భాగస్వాములు?
హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): ఐపిఎల్ కారణంగా చాపకింద నీరులా క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది.
నిరుద్యోగ యువత దీని కారణంగా నష్టపోతున్నారు. ఈ వ్యవహారం నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. నలుమూలలా తిష్టవేసిన కొందరు యువతను వక్రమార్గం పట్టిస్తున్నారు. చాప కింద నీరులా పలు జిల్లాల్లో క్రికెట్ బెట్టింగ్ విస్తరిస్తోంది. మూలాలను వెతికిపట్టి అడ్డుకట్ట వేయడంలో పోలీసులు వైఫల్యం
కనిపిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహస్యంగా ఉన్నత వర్గాలకు చెందిన వ్యాపారులు పోలీసుల కళ్లు గప్పి ఈ తంతును యథేచ్ఛగా నడిపిస్తున్నారు. ఈ మోజులో పడి లక్షల రూపాయల్ని పోగొట్టుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బెట్టింగులు జోరందుకుంటున్నాయి. రాత్రికిరాత్రే లక్షాధికారులు కావాలన్న ఆకాంక్ష యువతను పెడదోవ పట్టిస్తోంది. క్రమక్రమంగా గ్రామాల్లోనూ ఈ తీరు విస్తరిస్తోంది. సరదాగా కొనసాగుతున్న భావన కొందరి జీవితాలను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కారణమవుతోంది. రూ.10, రూ.50 మొదలు వందలు వేల రూపాయలకు ఇది విస్తరిస్తోంది. సరదాకు అని కొందరు.. ఇదో పసందు అని మరికొందరు ఈ వికృత క్రీడకు బానిసవుతున్నారు. పందెం వల్ల ఆర్థికంగా నష్టపోయినవారు కిమ్మనకుండా ఉంటున్నారు. లాభాలు గడించినవారు మరికొందరికి ఎర చూపుతూ ఈ తరహా జల్సాకు బానిసలుగా మారుస్తున్నారు. గెలిచినవారికి తొలుత నయాపైసలతో సహా కచ్చితంగా చెల్లిస్తారు. బెట్టింగ్ రుచి మరిగిన తరువాత గెలిచినా డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరగడం, ఇతరులతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, అవసరమైతే దౌర్జన్యాలకు దిగుతున్నారు. వీటన్నింటికీ ఈ బెట్టింగ్ వ్యవహారమే కారణమవుతోంది. రహస్యంగా సాగుతున్న తీరుపై
పోలీసుల నిఘా కరవవుతోందని చెప్పొచ్చు. ఫోన్లల్లో కోడ్ భాషతోపాటు నేరుగా వ్యక్తుల మధ్య పొడిమాటలతోనే ఈ పందాలను కొనసాగిస్తున్నారు. ఎక్కువగా స్నేహితులు. బాగా తెలిసిన వ్యక్తుల మధ్య ఈ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఏదో తరహాలో పని ఒత్తిడి సహా ఇతర కేసుల విషయంలో తీరిక లేకుండా ఉంటున్న పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జిల్లాల్లో చిరు వ్యాపారాల్లో యువతనే అధికంగా ఉంటున్నారు. వీరికి క్రికెట్‌పై ఉన్న వ్యామోహం మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేస్తోంది. రోజంతా కష్టపడిన దానికి క్షణాల వ్యవధిలో రెండింతల సొమ్ము వస్తుందనే సాకుతో పందెం కాస్తున్నారు. ఈక్రమంలో సర్వం కోల్పోతూ అప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా మ్యాచ్‌ల తీరుని బట్టి బెట్టింగ్ జోరు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెండు పెద్ద జట్ల మధ్య జరిగే ¬రా¬రీ పోరు అధిక ప్రభావం చూపిస్తోంది. ఒకటి పెద్ద జట్టు, రెండవది చిన్న జట్టు ఉన్న సమయంలోనూ పరుగుల విషయంలో ఎక్కువ బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. రెండు జట్లలోని బ్యాట్స్‌మన్‌ల వారీగా.. బంతి బంతికి, టాస్‌ల వారీగా ఈ తీరు మారుతున్నట్లు సమాచారం. చివరి ఓవర్లలో బెట్టింగ్‌ని ఎక్కువగా కాస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి రహస్య ఒప్పందాల్ని నిగ్గు తేలిస్తే ఈ వ్యాపకం తగ్గే అవకాశముంది. ఆర్థికంగా, మానసికంగా దెబ్బతినకుండా బెట్టింగ్‌ను వీలైనంత తొందరగా కఠినంగా అణిచివేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.