యూపిలో కాంగ్రెస్‌ పాచిక పారేనా?

వచ్చే ఎన్నికల్లో ఎవరిది పైచేయి కానుందో

లక్నో,జనవరి25(జ‌నంసాక్షి): యూపిలో రాజకీయం వేడిపుట్టిస్తోంది. ప్రియాంక కూడా ప్రచారంలో ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ దఫా ఎలాగైనా మెజార్టీ సీట్లు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. పేదల అనుకూల, నిజాయితీ పాలన నినాదాలుగా కమలనాథులు ముందుకు వెళుతున్నారు. పేదలు, నిజాయితీపరులు కులాలకు అతీతంగా సాధికారత సంపాదించామని ప్రచారం చేస్తున్నారు. గతంలో లాగా ఇక్కడ 71 సీట్లు వస్తాయన్న ధీమా మాత్రం లేదు. ధనికులు, అవినీతిపరులకు ప్రధాని మోదీ గట్టిగా బుద్ధిచెప్పారని ప్రచారంలో నేతలు సెలవిస్తున్నారు. ఫిబ్రవరి ఒకటోతేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌ను కేంద్రం శాయశక్తులా వినియోగించుకుంటుంది. పేదలు, రైతులు, మధ్యతరగతి, నిరుద్యోగుల కోసం బోలెడన్ని రాయితీలు, తాయిలాలు ప్రకటిస్తుందన్న ప్రచారం ఉంది. ఈ వర్గాలను ఆకట్టుకునే పనిలో భాజపా నిమగ్నమై ఉందని విశ్లేషించారు. 19 శాతమున్న ముస్లిం ఓట్లు కోసం ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి సర్వశక్తులొడ్డుతుందని, అలాంటపుడు ముస్లిం మెజారిటీ నియోజకవర్గాల్లో హిందూ ఓటర్లు గంపగుత్తగా తమకు మద్దతిస్తారని అంచనావేస్తోంది. ముస్లిం ఓట్లు ఎస్పీ, బీఎస్పీ మధ్య గంపగుత్తగా పడతాయనీ ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు తమకు అనుకూలిస్తాయని భావిస్తున్నారు. శాంతిభద్రతల ఘోర వైఫల్యం, దాడులు లాంటివి యోగి ప్రభుత్వాన్ని నీలినీడలా వెంటాడుతున్నాయి. యాదవులు, ముస్లింల ఓటుబ్యాంకును ఎస్సీ,బిఎస్పీ కూటమి నేతలు నమ్మకున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూల ఓటుగా మలచుకోవడానికిచేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయా అన్నదే ప్రశ్న. రాష్ట్రంలో భాజపా దూకుడును గమనించే కాంగ్రెస్‌ ప్రియాంకను రంగంలోకి దింపింది.మొత్తంగా ఈ వ్యవహారాలు ఎవరికి లాభిస్తాయన్నది ముఖ్యం.