యూపిలో మళ్లీ అత్యధిక ఎంపి సీట్ల గెలుపు లక్ష్యం

ఇప్పటినుంచే పావులు కదుపుతున్న కమలదళం

లక్నో,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): బిజెపి 2019 ఎన్నికలలో కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టాలి అంటే వచ్చే మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో గెలవడం కీలకం కానుంది. ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలలో గెలుపొందడం ద్వారా పార్టీ బలమైన పార్టీగా ఎదిగింది. అయితే ఇక్కడ భారీగా ఉన్న పార్లమెంట్‌ సీట్లను గతంలో గెలిచిన మాదిరిగానే మళ్లీ గెలవాలని బిజెపి నాయకత్వం భావిస్తున్నది. 2014లో ఉత్తర ప్రదేశ్‌లో గల 80 లోక్‌ సభ స్థానాలలో సొంతంగా 71 గెలుచుకోవడం, మరో రెండు స్థానాలలు మిత్రపక్షం అప్నా దళ్‌ గెలవడమే కేంద్రంలో సొంత బలంతో మూడు దశాబ్దాల అనంతరం ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పరచే అపూర్వ విజయాన్ని నరేంద్ర మోడీ సొంతం చేసుకోగలిగారు. అక్కడి ములాయం కటుంబ కలహాలు ఇంకా సమిసిపోలేదు. మాయావతి ఎత్తులు పనిచేయడం లేదు. ఇవన్నీ తమకే ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇకపోతే ఇటీవలి సుప్రీం తీర్పుతో తలాఖ్‌ విషయంలో ముస్లిం మహిళలలు బిజెపికి అనుకూలంగా ఉన్నారు. వారు బిజెపిని బలంగా నమ్ముతున్నారు. సగటు పౌరులకు కూడా సిఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు. కుటుంబ కలహాల వల్ల యూపి అభివృద్ది దెబ్బతిందన్న ప్రచారం చేయడం ద్వారా గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 300లకు పైగా అసెంబ్లీ స్థానాలు గెల్చుకుంది. ఇదే టెంపోను యూపిలో కంటిన్యూ చేయాలని యోచిస్తోంది. యూపిని ఇంతకాలం కేవలం కుటుంబం కోసం వాడుకున్నారన్న ప్రచారం బాగా కలసి వచ్చింది. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత కొద్దీ నెలలుగా తీసుకొంటున్న పలు చర్యలు ఆ రాష్ట్రంలో ఓటర్లను ఆకట్టుకొనే దిశలో సాగుతున్నాయి. గోరక్షకులపై తీవ్రమైన పదజాలం ఉపయోగించి అక్కడి దళితులనుకూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. యూపిలో అధికారం కైవసం చేసుకోవడం కోసం వ్యూహాత్మకంగా బిజెపి చేసిన యత్నాలు ఫలించాయి. అయితే రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తలలో 2014 నాటి ఉత్సాహాన్ని కలిగించడంలో బిజెపి నాయకత్వం విఫలం అవుతున్నది. నరేంద్ర మోడీ ప్రభుత్వ పనితీరు అంతగా సంతృప్తికరంగా లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. ఇకపోతే మాయావతిని బలహీనం చేయాలి అంటే ఆమెకు గట్టి అండగా ఉంటున్న రాష్ట్రంలో 22 శాతం వరకు ఉన్న

దళితులలో పెద్ద ఎత్తున మద్దతు సవిూకరించు కోవడమే బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇది విజయం అయ్యింది. అందుకే వారిలో విశ్వాసం పాదుకొల్పే ప్రయత్నాలు చేస్తోంది. అదే విధంగా బ్రాహ్మణులను తమవైపు తిప్పుకొని ప్రయోజనం పొందారు. గోరక్షకుల పేరుతో అక్కడక్కడా దళితులపై దాడులు జరిగిన సందర్భంలో పార్టీ స్పందించిన తీరు సహితం ఆయా వర్గాలలో విశ్వాసం చూరగొనేందుకు తోడ్పడుతోంది. ప్రధానమంత్రి ఈ విషయమై తీవ్రంగా స్పందించిన తీరు కలసి వస్తోంది. ఉత్తరప్రదేశ్‌ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం వల్ల వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఇప్పుడున్న ఎంపి స్థానాలను గెల్చుకోవాలన్న ప్రయత్నాల్లో బిజెపి ఉంది. రాష్ట్రంలోని ఆయా పార్టీ నాయకులలో నెలకొన్న ముఠా తగాదాలు కూడా బిజెపి బాగా వాడుకుంది. సిఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా సమస్యలపై వేగంగా స్పందస్తున్నారు. ప్రధానంగా శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వేళ్లూనికుని పోయిన అరచాక ముఠాలను అణచివేస్తున్నారు.