యూపి బుల్‌డోజర్లకు సమర్థన

తెలంగాణలో మాత్రం విమర్శలా ?
బిజెపి ద్వంద్వ నీతికి సమాధానం చెప్పాలి
హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనం సాక్షి) యూపి బుల్‌డోజర్లు తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాకపోతే అక్కడిలాగా ఇక్కడ ఎంతకాలం అన్న సందేహాలు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం బిజెపి హర్షించలేక పోతున్నది. బిజెపి ద్వంద్వనీతికి ఇది పరాకాష్టగా చూడాలి. కూల్చివేతలను స్వాగతించకుండా రాజకీయ విమర్శలు చేయడం బిజెపికే చెల్లింది. హైడ్రా దాడుల ద్వారా రేవంత్‌రెడ్డి ప్రజల్లో భరోసా కల్పించారు. ప్రజా నాయకుడన్న పేరు తెచ్చుకుంటున్నారు. ప్రజలకు చేరువయ్యే క్రమంలో కొంతవరకు విజయం సాధించారు. డబ్బూ హోదా బాగా ఉన్న కబ్జాదారుల గుట్టు రట్టయిందని, వారిని కూడా చట్టం దృష్టిలో దోషులగా నిలబెట్టారని ప్రశంసిస్తున్నారు. ఈ కూల్చివేతల వల్ల, రేవంత్‌రెడ్డికి కొంత ఇమేజ్‌ పెరిగింది. దొరికింది. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ ’హైడ్రా’ అధ్యాయం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. బిఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శలకు తోడుగా అన్నట్లుగా బిజెపి నేతలు కూడా దీనిని దృష్టి మరల్చే కార్యక్రమంగా చూడడం, విమర్శలు చేయడం సరికాదు. వారు బిఆర్‌ఎస్‌ ఎజెండాలో నడుస్తున్నారని జనం మండిపడుతున్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో సతమతమవుతున్నారని, తన ముద్ర చూపించలేకపోతున్నారని ఎకసక్కెం మాటలు అంటున్నారు. అసలు ఇంకా పట్టే సంపాదించలేదని విమర్శించేవారి జాబితాలో చేరారు. ఒకప్పుడుచెరువుల పట్టణంగా వర్ధిల్లిన హైదరాబాద్‌ను కబ్జాకోరులు ఆక్రమించేశారు. రియల్‌ దందాలు చేస్తున్నారు. ఆపార్ట్‌మెంట్లు కట్టి అమ్ముకుంటున్నారు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. బిజెపి కూడా ఒక్క పోరాటం కూడా చేయలేదు. ఇకనైనా ఆక్రమణలను నిరోధించి, ఉన్న మేరకైనా నగరాన్ని కాపాడుకోవాలన్న స్పృహ వారిలో కలగడం లేదు. ఆక్రమణలకు మూలకారకులెవరు అన్న చర్చ జరిపి వారిని దోషులగా నిలబెట్టాలన్న ప్రయత్నంలో బిజెపి వెనకబడి పోయింది. చేస్తున్న పనులను ప్రోత్సహించివుంటే బిజెపి గ్రాఫ్‌ పెరిగేది. ఘరానా బాబులు ఆక్రమించగా, వారికి అనుమతుల తివాచీలు పరిచిందెవరన్నది బయటకు రావాలి. బాధ్యులైన అధికారులు శిక్ష నుంచి తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత బిజెపిపైనా ఉంది. ప్రభుత్వ భూములలో తలదాచుకునేవారిని అత్యుత్సాహంతో ఈడ్చిపారేసిన అధికారులు ఈ కబ్జాలకు ఎలా వత్తాసు పలికారో ప్రజలకు తెలియాలి. మహానగరంలో వరదలు ముంచెత్తినప్పుడు గొంతు చించుకున్న బిజెపి నేతలు ఇప్పుడు గొంతు సవరించుకుని మాట్లాడుతున్నారు. అస్మదీయుల కైనా నోటీసులు, కూల్చివేతలు తప్పవని ముఖ్యమంత్రి చెప్పడం ద్వారా చేసిన హెచ్చరికలను కఠినంగా అమలు చేయాలి. అక్రమార్కులను బోనెక్కించాలి. రేవంత్‌రెడ్డి ఇమేజ్‌ను ’హైడ్రా’ ఎంతవరకు తీసుకెళుతుందన్నది..రేపటి చర్యలను బట్టి ఉంటుంది. కూల్చివేతల సారథిగా పోలీసు అధికారి రంగనాథ్‌కు హైడ్రా ద్వారా వణుకు పుట్టిస్తున్నారు. అయితే కూల్చివేత చర్యలు ఆగిపోయినప్పుడు మాత్రం రేవంత్‌రెడ్డికే అప్రతిష్ట దక్కుతుంది. ఆక్రమణదారులు ప్లట్లుగా అమ్ముకుని సొమ్ముచేసుకున్నారు. వారిని గుర్తించి డబ్బులు కూడా రాబట్టాలి. కొనుక్కున్న మధ్యతరగతి ప్రజలు నష్టపోకుండా చూడాలి. చెరువులు అయినా, మూసీ రక్షణ అయినా, కఠినంగా వ్యవహరిస్తే హైదరాబాద్‌ బాగుపడుఉతంది. ఇప్పటిదాకా జరిగిన కబ్జాలు, జలాశయాలకు కల్పించిన అవరోధాలు, ఎంతవరకు దిద్దుబాటు చేయగలమో పరిశీలించి, ఆ దిశగా చర్యలు చేపట్టాలి, నగర జీవనాన్ని మరింత క్షేమం, సౌకర్యం, పర్యావరణ హితం చేయడమే కర్తవ్యాలుగా ఉండాలి. వర్షప్రవాహాలను
ప్రభావితం చేసి, నిర్మాణాలు చేసినవారి నుంచి పెద్ద ఎత్తున జరిమానాలు వసూలు చేయాలి. నగర పర్యావరణాన్ని, జలవనరులను రక్షించడానికి కఠిన నిబంధనలు తీసుకుని రావాలి. అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకులను కబ్జాలకు బాధ్యులను చేయాలి. అప్పుడే ఆశించిన లక్ష్యం నెరవేరగలదు.