యూపీలోనే ద్వేషపూరిత దాడులు ఎక్కువ

– వెల్లడించిన మానవహక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌
న్యూఢిల్లీ, జులై17(జ‌నం సాక్షి): దేశంలో విద్వేషపూరిత దాడులు ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోనే ఎక్కువగా జరుగుతున్నాయని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వెల్లడించింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా సుమారు 100కి పైగా విద్వేషపూరిత దాడులు జరిగాయని, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, ట్రాన్స్‌జెండర్స్‌పైనే ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నాయని సంస్థ పేర్కొంది. యూపీలో అత్యధికంగా 18 కేసులు నమోదు కాగా.. గుజరాత్‌లో 13 కేసులు, రాజస్థాన్‌లో 8, తమిళనాడు, బిహార్‌లో ఏడు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆమ్నెస్టీ నివేదిక వెల్లడించింది. గోవులను అపహరించుకుపోతున్నారని వదంతులు వ్యాప్తి చెందడం వల్ల జూన్‌లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఆమ్నెస్టీ ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 67 ద్వేషపూరిత దాడులు దళితులపై జరగ్గా.. ముస్లింలపై 22 దాడులు జరిగినట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. ఈ ద్వేషపూరిత దాడుల్లో ఎక్కువగా గోసంరక్షణ పేరిట దాడులు, పరువు హత్యలు జరుగుతున్నాయని ఆమ్నెస్టీ రిపోర్టు తెలిపింది. ద్వేషపూరిత దాడులను ప్రత్యేకమైన నేరంగా పరిగణించలేకపోవడం వల్ల ఇటువంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయపడింది.