రక్తమోడిన రహదారులు 

– రాజస్థానంలో పెళ్లి బృందంపైకి దూసుకెళ్లిన ట్రక్కు
– 13మంది మృతి.. మరికొంతమందికి తీవ్రగాయాలు
– యూపీలో రెండు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు
– 12మంది మృతి, పలువురికి గాయాలు
– సికింద్రాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
జైపూర్‌, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రతాప్‌గఢ్‌ జిల్లా అంబవాలిలో పెళ్లి ఊరేగింపుపైకి ట్రక్కు దూసుకెళ్లింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో 13మంది చనిపోగా.. మరో 20మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ట్రక్‌ డ్రైవర్‌ ఓవర్‌ స్పీడుతో దూసుకు రావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్లు తెలుస్తుంది. డ్రైవర్‌ ఊరేగింపును గమనించకపోవడంతోనే ఘటనకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ పారిపోగా.. 113వ నంబరు జాతీయ రహదారి కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ట్రక్‌ను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.  మరోవైపు ఈ ప్రమాదంతో పెళ్లింట విషాదాన్ని నింపింది. బంధువులు సందడిగా కనపడాల్సిన గ్రామం.. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటింది. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
యూపీలో..
ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారు. వేగంగా వస్తున్న ఓ అంబులెన్సు యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై డివైడర్‌ను ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. ఆగ్రా నుంచి నోయిడావైపు వెళ్లున్న అంబులెన్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. మరో ఘటనలో ఓ కారు రోడ్డుపై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టి.. పక్కనున్న కాలువలో పడడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బులందర్‌షా సవిూపంలోని అనూప్‌షహర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
తార్నాకలో ఇద్దరి మృతి…
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ తార్నాక డిగ్రీ కళాశాల వద్ద మంగళవారం ఉదయం రోడ్డు
ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను నవీన్‌(50), సోమరాజు(32)గా గుర్తించారు. గ్యాస్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.