రణరంగాన్ని తలపించిన..  ఢిల్లీలోని ఘజియాబాద్‌ పరిసరాలు


– కిసాన్‌ క్రాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
– పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట
– వేలాది మంది రైతులపై జలఫిరంగులు ప్రయోగించిన పోలీసులు
– ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
– పోలీసుల తీరును ఖండించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : ఢిల్లీలోని ఘజియాబాద్‌ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. సమస్యల పరిష్కారం కోరుతూ.. ర్యాలీగా వచ్చిన 30వేల మందిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం జరిగింది.. దీంతో పరిస్థితి చేదాటుతుండటంతో పోలీసులు ఆందోళనలకు దిగిన రైతులపై జలఫిరంగులు ప్రయోగించారు.. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని, రుణాలు మాఫీ చేయాలని, ఎన్సీఆర్‌లో పదేళ్లు పైబడిన ట్రాక్టర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఇంకా పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ నుంచి సెప్టెంబరు 23న కిసాన్‌ క్రాంతి ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల విూదుగా అక్టోబరు 2న ఢిల్లీలోని కిసాన్‌ ఘాట్‌కు చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. కాగా మంగళవారం వారు ఢిల్లీలోని కిసాన్‌ ఘాట్‌కు చేరుకొనే క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని, నగరంలోకి వెళ్లేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. పది రోజులుగా మహా పాదయాత్ర చేపట్టి ఢిల్లీకి చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో వారు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులకు, రైతులకు తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో రైతులను అడ్డుకునేందుకు పోలీసులు భాష్పవాయువు, జలఫిరంగులను ఉపగించారు.  దీంతో భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన వేలాది మంది రైతులు ఢిల్లీ- ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులో రోడ్లపై వేచి చూస్తున్నారు. అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత నరేశ్‌ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ఇక్కడ(ఢిల్లీ-యూపీ సరిహద్దు) ఎందుకు ఆపారు? మేము క్రమశిక్షణతో శాంతయుతంగా నిరసన ర్యాలీ చేస్తున్నామని అన్నారు. మా సమస్యల గురించి ప్రభుత్వానికి కాకుండా ఎవరికి చెప్పాలి అని ప్రశ్నించారు. పాకిస్థాన్‌కో లేదా బంగ్లాదేశ్‌కో వెళ్లిపోవాలా అంటూ ఆవేశంగా అన్నారు. కాగా ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ రైతులను నగరంలోకి ప్రవేశించనివ్వండి…
వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ప్రశ్నించారు. వారిని అడ్డుకోవడం తప్పని పేర్కొన్నారు.