రఫేల్‌పై మోడీ కప్పదాటు

ఎన్ని సార్లు అడిగినా సమధానం రావడం లేదు: రాహుల్‌

న్యూఢిల్లీ,జనవరి30(జ‌నంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి మండిపడ్డారు. రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై ప్రభుత్వంలోనే అసమ్మతి ఉందని, దీంతో ప్రధాని మోదీకి నిద్ర పట్టడం లేదని ఆరోపించారు. తల్కతోర స్టేడియంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. తాను ప్రధాని మోదీని మూడు, నాలుగు ప్రశ్నలు అడిగానని, ఆయన అటు, ఇటు, క్రింద, పైన చూశారని, కానీ తనవైపు, తన కళ్ళలోకి కళ్ళు పెట్టి మాత్రం చూడలేకపోయారని రాహుల్‌ చెప్పారు. కాపలాదారు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోయారని చెప్పారు. మోదీ ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా జరిగిన సంఘటనను రాహుల్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై రాహుల్‌ గాంధీ ప్రసంగించినపుడు చెప్పిన మాటలను ప్రస్తావించారు. దొంగతనం చేసినవాళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేరన్నారు.