రాఘవులు నారాయణకు లేఖ
హైదరాబాద్ : వామపక్షాలకు ప్రజల్లో ఉన్న పట్టును నిలుపుకునేందుకు రానున్న స్థారిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర కమిటీ సమావేశంలో తీసుకొన్న ఈ నిర్ణయాన్ని వివరిస్తూ సీపీఐ కార్యదర్శి నారాయణకు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ అవకాశవాదం, అవినీతిలో మునిగిపోయాయని రాఘవులు విమర్శించారు. కుల, మత, ప్రాంతీయ తత్వాలతో ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిన కమ్యూనిస్టు పార్టీలు జనంలోకి చైతన్యాన్ని సంఘటితం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రజల్లో తమకున్న పునాదిని నిలబెట్టుకునేందుకే గత ఉప ఎన్నికల సమయంలో ఒంటరిగా పోటీ చేసినట్లు నారాయణకు రాసిన లేఖలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా కలిసి పోటీ చేద్దామని ఆహ్వానించారు. ఉప ఎన్నికల సమయంలో తెదేపాకు మద్దతు విషయంలో పునరాలోచించుకోవాలని సీపీఎం సూచించిందని నారాయణ ఓ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొనడాన్ని రాఘవులు ఖండించారు. తాము ఎన్నడూ అలాంటి సూచనలు చేయలేదన్నారు.