రాజకీయాలకు ఇది సమయమా?
– ప్రధాని మాటలు మాని పాక్‌కు చేతలద్వారా బుద్దిచెప్పాలి
– కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ శివసేన
ముంబయి, ఫిబ్రవరి18(జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం తీరుపై శివసేన పార్టీ మరోసారి విమర్శల దాడికి
దిగింది. రాజకీయ దాడులకు ఇది సమయమా అంటూ తన పార్టీ పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది.
ఉరీలో ఉగ్రదాడి జరిగిన తరువాత మెరుపుదాడులు నిర్వహించారని, కానీ, అసలైన మెరుపుదాడులు అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలన్నారు. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టేందుకు అమెరికా.. పాకిస్థాన్‌లోకి ప్రవేశించి, అతడిని హతమార్చిందన్నారు. వీటిని మెరుపుదాడులు అంటారని సూచించింది. ఇది రాజకీయ ప్రత్యర్థులపై మెరుపుదాడులు చేయడానికి తగిన సమయం కాదని, జవాన్ల మృతికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై దాడి చేయాలని పేర్కొంది. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామని మన ప్రధాని అంటున్నారని, ఇలా చెప్పడం కాకుండా చేసి చూపాలన్నారు. ఎల్‌టీటీఈ వేర్పాటువాదుల్ని తొలగించడంలో అప్పట్లో శ్రీలంక ప్రభుత్వం చూపిన ధైర్యాన్ని మన ప్రభుత్వం కూడా చూపితే, పాకిస్థాన్ వంటి 100 దేశాలనైనా భారత్ ఎదిరించగలదన్నారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని, మన జవాన్లకు మద్దతుగా నిలబడాల్సిన సమయమని శివసేన సామ్నాలో పేర్కొంది. దేశం ఎంతో మంది ఆగ్రహావేశాలను, రాజకీయ విజయాలను చూసిందని, కానీ, ఇప్పటి వరకు కశ్మీర్ సమస్యకు పరిష్కారం లేదన్నారు. జవాన్లపై ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదని విమర్శించింది.