రాజకీయాలు, క్రీడలను కలపొద్దు
– భారత్ ఆ రెండింటినీ కలపడం దురదృష్టకరం
– పాక్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ వసీమ్ ఖాన్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి18(జనంసాక్షి) : పుల్వామా దాడి నేపథ్యంలో భారత్ వ్యవహరిస్తున్న నిరసన వైఖరిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర స్థాయిలో మండిపడింది. దాడిలో అసువులు బాసిన అమర జవాన్లకి నివాళి అర్పిస్తూ.. ఇప్పటికే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ముంబయిలోని తమ కార్యాలయంలో పాక్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చిత్రపటంపై పరదా కప్పి నిరసన తెలపగా.. పంజాబ్ క్రికెట్ అసోషియేషన్ తమ పరిధిలోని మొహాలి స్టేడియం గ్యాలరీలో ఉన్న పాక్ క్రికెటర్ల ఫొటోలను తొలగించింది. మరోవైపు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) 2019 సీజన్ ప్రసారాలను భారత్‌లో సంబంధిత ప్రసార సంస్థలు నిలిపివేశాయి. డిజిటల్ విూడియా కూడా పాక్‌కి చెందిన గాయకుల వీడియోలను పూర్తిగా తొలగించి నిరసన తెలుపుతోంది. ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న వరల్డ్‌కప్‌లోనూ పాకిస్థాన్‌తో తలపడే మ్యాచ్‌ను టీమిండియా బహిష్కరించాలని అభిమానుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. భారత్ తీరుపై తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ వసీమ్ ఖాన్ ఘాటుగా స్పందించాడు. ‘దేశాలు, ప్రజలను కలిపేందుకు స్పోర్ట్స్ ఎప్పుడూ బ్రిడ్జ్‌లా ఉపయోగపడతాయన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే చరిత్ర స్పష్టం చేసిందని తెలిపారు. రాజకీయాలు వేరు, క్రీడలు వేరని, ఈ రెండింటినీ విడిగానే చూడాలని, అయితే ప్రస్తుతం భారత్‌లో రెండింటినీ కలిపేశారని విమర్శించారు. గత మూడు రోజులుగా భారత్ నిరసన తెలుపుతున్న తీరు అత్యంత విచారకరంగా ఉందన్నారు. ఇమ్రాన్ ఖాన్ చిత్రపటంపై పరదా కప్పడం, కొన్నిచోట్ల ఫొటోల్ని తొలగించడం హేయమైన చర్య అని మండిపడ్డాడు.