రాజకీయ పార్టీలకు భస్మాసురహస్తం కానున్న పథకాలు


పందేరాలు చేస్తుంటే మిగతావారిలో పెరగనున్న డిమాండ్లు
ఖజానాను మించి హావిూలతో ఆర్థిక సంక్షభంలోకి రాష్టాల్రు
హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): పాకులకు పథకాలు మానసపుత్రికలు…ఒక్కో పథకంతో ఒక్కో వర్గాన్ని ఆకట్టుకోవడం ద్వారా ఓట్లు రాల్చే చెట్లలాగా వాటిని పెంచి పోషిస్తారు. ఇందుకు ఇందిరాగాంధీ హయాలో మొదలైన పథకాల వడ్డింపులు ఇప్పుడు నిరంతరాయంగా సాగుతున్నాయి. వీటికి మోడీ కూడా అతీతుడేం
కాదు. దేశం లేదా రాష్టాల్ల్రో మౌళిక వసతులు పెంచి, ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా విద్యా వైద్యంతో పాటు ఉపాధి రంగాలను ప్రోత్సహించాల్సిన పాలకులు తాత్కాలిక ఉపశమనం కలిగించే లేపనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు రాష్టాల్ల్రో ఇలా పథకాలు వెల్లువలా ప్రవహిస్తున్నాయి. డబ్బులను పందేరం చేయకుండా నిరోధించే వ్యవస్థ ఏదీ మనదగ్గర లేకపోవడంతో పన్నులు బాదడం.. పథకాలు పెట్టడం అన్నచందంగా పాలన సాగుతోంది. ఎపిలో అయితే సిఎం జగన్‌ చేతికి ఎముక లేదన్నట్లు గా దానాలను చేపట్టారు. అదే పాలనగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో దళితులకు తీసుకుని వచ్చిన దళితబంధు కేవలం డబ్బుల పంపిణీ పథకంగా చూడాల్సిందే. నిజానికి వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించి, ఇల్లు కట్టించి ఉన్నతంగా తీర్చిదిద్దేలా చేస్తే ఈ దుబారా అసవరం వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఓట్లు కూడా రాల్చుకోవాలి కనుక నేరుగా డబ్బులు వెదజల్లే పథకంగా రూపుదిద్దుకుంటోంది. దేశంలోని అనేక ప్రాంతాల లో ఇప్పటికీ అంటరానితనం, రెండు గ్లాసుల విధానం అమల్లో ఉంది. దళితులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. వారిని ఆర్థికంగా గుప్పిట్లో పెట్టుకున్న సమాజం చిన్నచూపు చూస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా కేసీఆర్‌ ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిపోతుంటాయి. ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నిక పుణ్యమా అని దళితబంధు పథకం పురుడు పోసుకుంది. దాంతో ఇప్పుడు ఆ పథకం గురించి కేసీఆర్‌ అద్భుతమని చెబుతున్నారు. ఇంతకాలానికి ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నిక పుణ్యమా అని దళితులకు మంచి జరుగుతోందనే చెప్పాలి. హుజారాబాద్‌ కన్నా ముందు వాసాలమర్రి గ్రామానికి వెళ్లిన ఆయన దళితుల ఇళ్లకు వెళ్లడమే కాకుండా వారితో కలసి భోజనం చేశారు. ఊరూవాడా కలియ తిరిగారు. దళితుల స్థితిగతులపై ఆవేదన చెందారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో రాజకీయ ప్రయోజనం పొందడం కోసమే దళితబంధు పథకం అమలు చేస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినందున ఆక్షేపించడానికి లేదు. అయితే కేసీఆర్‌ ఎత్తులూ, జిత్తులూ తెలుసుకున్న రాజకీయ పార్టీలు అందుకు విరుగుడుగా ఆలోచన చేస్తున్నాయి. దళితబంధుతో పాటు, గిరిజన బంధు, మైనార్టీ బంధు కావాలన్న నినాదాలను తెరపైకి తెచ్చి ఆయా వర్గాలను రెచ్చగొడు తున్నాయి. రాజకీయ లబ్ది కోసం కేసీఆర్‌ ఆవిష్కరించిన దళితబంధు పథకం ఆయనకు మేలు చేస్తుందా లేదా అన్నది హుజరాబాద్‌ ఫలితం తేల్చనుంది. ఈ పథకం వల్ల హుజూరాబాద్‌లో ఓట్ల వర్షం కురుస్తుందని కేసీఆర్‌ లెక్కలు వేసుకుంటు న్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రుల్లో మాత్రం అది గుబులు పుట్టిస్తోంది. అయితే గతంలో కెసిఆర్‌ను తిట్టిపోసిన మోత్కుపల్లి నర్సింహులు లాంటి వారు దళిత జనోద్దారకుడిగా కీర్తిస్తున్నారు. అనేకమంది దళిత నేతలు కూడా కెసిఆర్‌ను ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో దళితుల పరిస్థితి దారుణంగా ఉందని, వారికి ఇంతకాలానికి మంచి జరుగబోతున్నదని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇంతకాలానికి దళితుల స్థితిగతులపై కేసీఆర్‌ పెద్దమనసుతో ముందుకు రావడం హర్షణీయమే. తెలంగాణలోని దళితులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. అయితే పథకాల బడ్జెట్‌ లెక్కలు మారుతున్నాయి. బడ్జెట్‌ను మించి హావిూలు గుప్పిస్తున్నారు. దీంతో రానురాను ఇవి మోయలేని భారంగా మారనున్నాయి. అలాగే అన్ని కులాలు, వర్గాల వారు తమకో ..అంటూ రాగం తీస్తున్నారు. ఈ క్రమంలో ఈ పథకాలు భస్మాసుర హస్తం కానున్నాయి. కులాల కుంపట్లు రాజుకునే ప్రమాదం ఉందని పలువర్గాలు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో దళితబంధు తరహాలో తమకు కూడా ఇటువంటి పథకం అమలు చేయాలని సమాజంలోని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు మొదలయ్యాయి. దళితబంధు కింద ఒక్కో
కుటుంబానికి ప్రభుత్వం నుంచి పది లక్షల రూపాయల చొప్పున పంచిపెట్టనున్నందున తమకు కూడా అలాగే ఇవ్వాలని బీసీలు, ఆదివాసీలు కోరడం మొదలైంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియదు. ప్రస్తుతానికి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మాత్రమే దళితబంధును అమలు చేస్తున్నందున ఈ పథకం ఫలాలు తమకు ఎప్పుడు అందుతాయోనని మిగతా నియోజకవర్గాలకు చెందిన దళితులు అప్పుడే డిమాండ్లు పెట్టారు. అలాగే వివిధ రాజకయీ పార్టీలు కూడా వారిని ఎగదోస్తూనే ఉంటాయని గుర్తించాలి. లబ్దిదారుల ఎంపికలో న్యాయం జరగడం లేదని హుజూరాబాద్‌లో అప్పుడే రభస జరగడాన్ని చూశాం. అదే సమయంలో దళితులు మాత్రమే ఓటర్లా? మేం కాదా? అని బీసీలు, ఇతర వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పథకాలు నిజంగానే భస్మాసుర హస్తంలా తయారవుతాయనడంలో సందేహం లేదు. అదే సమయంలో తమ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలంటే ఉపఎన్నిక రావాల్సిందేనన్న డిమాండ్లు పుట్టుకుని వస్తున్నాయి. తమ నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు మార్గం సుగమం చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు వారి రాజీనామాల కోసం డప్పు చాటింపు కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించు కుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సదుద్దేశ్యంతోనే దళితబంధును ప్రవేశపెట్టినా అది విపరీత పరిణామాలకు దారితీసే ప్రమాదం కూడా పొచి ఉంది. దళితబంధు గురించి ఎంత గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ, దళిత నాయకులతో ప్రకటనలు చేయిస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడానికి సమయం పడుతుంది. అలాగే అనవసరంగా పందేరాల ద్వారా తేనెతుట్టెను కదిపి నట్లుగానే భావించాలి. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడిరచాలన్న పట్టుదల పెరిగి పోవడంతో కెసిఆర్‌ అలవికాని పథకాలకు శ్రీకారం చుట్టారన్న విమర్శలు కూడా ఉన్నాయి. హుజూరాబాద్‌ కోసం ఇంతకాలం పెండిరగ్‌లో ఉన్న రేషన్‌ కార్డుల జారీ పక్రియ చేపట్టారు. డ్వాక్రా మహిళలకు సబ్సిడీ మంజూరు చేశారు. 57 ఏళ్ల వయసు వచ్చిన వారికి కూడా పెన్షన్లు ఇస్తామన్న హావిూని ఆగమేఘాల విూద తీసుకుని వచ్చారు. ఈ ప్రభావం మిగతా నియోజకవర్గాలపై తీవ్రంగా పడుతోంది. ప్రజలలో ఆశలు పుట్టించడం వల్ల అవి నెరవేర్చకపోతే కెసిఆర్‌ వ్యూహం బెడిసి కొట్టే ప్రమాదం లేకపోలేదు. మరోవైపు కేందప్రభుత్వం విధిస్తున్న షరతుల వల్ల ఎడాపెడా అప్పులు చేయడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడిరది. దీనిని అధిగమించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారన్నదే ముఖ్యం.