.రాజస్థాన్‌లో ఘోరం..


` బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. 12 మంది సజీవదహనం!
బర్మేర్‌,నవంబరు 10(జనంసాక్షి): రాజస్థాన్‌లోని బర్మేర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బర్మేర్‌`జోధ్‌పూర్‌ హైవేపై వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది సజీవదహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నారు. ఉదయం 9.55 గంటలకు బస్సు బలోత్రా నుంచి బయల్దేరింది. కాసేపటికే పచపద్ర సవిూపంలో హైవేపై రాంగ్‌ రూట్‌లో వస్తోన్న ఓ ట్రక్కు బస్సును ముందునుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఇంజిన్‌ పేలి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే బస్సు అంతటా మంటలు వ్యాపించాయి. ఈ ఊహించని ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కొందరు కిటికీ అద్దాలు పగలగొట్టి బయటకు వచ్చారు. సమాచారమందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకుపోయిన 10 మందిని కాపాడారు. ఈ ఘటనలో 12 మంది మంటల్లో సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు. కొందరు గాయపడగా.. వారిని సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు.