రాజీవ్ సక్సేనా అరెస్ట్!
– స్వదేశానికి చేరుకోగానే అదుపులోకి తీసుకున్న ఈడీ
– అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక అడుగు
న్యూఢిల్లీ,జనవరి31(జనంసాక్షి): అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడైన రాజీవ్ సక్సేనాను గురువారం తెల్లవారు జామున ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో దర్యాప్తులో కీలక ముందడుగు పడినట్లయింది. ఈ కేసులో నిందితుడైన కార్పొరేట్ లాబీయిస్టు రాజీవ్ సక్సేనాతో పాటు మరో లాబీయిస్టు దీపక్ తల్వార్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. యూఏఈ బుధవారం వీరిని భారత్‌కు అప్పగించింది. దీంతో సక్సేనా, దీపక్ తల్వార్‌లను గురువారం తెల్లవారుజామున స్వదేశానికి తీసుకొచ్చారు. అనంతరం వీరిద్దరినీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. కాగా సాయంత్రం వీరిని కోర్టులో హాజరుపర్చనున్నారు. యూఏఈ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు రాజీవ్ సక్సేనాను అతడి నివాసం నుంచి భద్రతాసిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో భారత అధికారులకు అప్పగించారు. గురువారం తెల్లవారుజామున 1.30గంటల ప్రాంతంలో సక్సేనా, తల్వార్‌లను తీసుకుని అధికారులు ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవలే ఈ కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను దుబాయి నుంచి తీసుకొచ్చి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సక్సేనా అరెస్టుతో ఈ కేసులో కీలక ముందడుగు పడినట్లయింది. అగస్టా వ్యవహారంలో సక్సేనాకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సక్సేనాకు ఈడీ అనేకసార్లు సమన్లు పంపింది. గతేడాది జులైలో సక్సేనా భార్య శివాని సక్సేనాను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు. ఇక దీపక్ తల్వార్‌పై కూడా అవినీతి, పన్ను ఎగవేత ఆరోపణలు ఉన్నాయి.



