రాజీవ్‌ హత్య కూడా యాక్సిడెంటేనా?

– దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్రమంత్రి
న్యూఢిల్లీ, మార్చి5(జ‌నంసాక్షి) : పుల్వామా ఉగ్రదాడిని ‘యాక్సిడెంట్‌’గా పేర్కొంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించడంపై కేంద్ర విదేశాంగ సహాయమంత్రి వీకే సింగ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం రాంచీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దాడిలో దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ మరణించడం కూడా ప్రమాదమేనా అంటూ దిగ్విజయ్‌ను ప్రశ్నించారు. రాజీవ్‌ గాంధీ హత్య ప్రమాదమా లేక తీవ్రవాద సంఘటనా దిగ్విజయ్‌ సింగ్‌ దీనికి సమాధానం చెప్పాలని నిలదీశాడు. దేశానికి సంబంధించిన వ్యవహారాల్లో ఇష్టమొచ్చినట్లు మాట్లాడవదని సూచించారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఇతర దేశాలకు భారత్‌ ప్రజాస్వామ్యంపై చులకన భావన ఏర్పడుతుందని, ఉగ్రవాదులను అంతమొందించడంలో రాజకీయాలకు తావులేకుండా అందరం ఐక్యంగా ముందుకెళ్లాలని దిగ్విజయ్‌కు సూచించారు. పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రస్థావరాలపై ఐఏఎఫ్‌ నిర్వహించిన వైమానిక దాడుల్లో 250 మందికి పైగా తీవ్రవాదులు చనిపోయారంటూ బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపైనా వీకే సింగ్‌ స్పందించారు. వైమానిక దాడులు జరిగినప్పుడు అక్కడి భవనాల్లో ఎంతమంది ఉన్నారన్న దానిపైనే మృతుల సంఖ్య ఆధారపడి ఉంటుందన్నారు. అది కేవలం అంచనా మాత్రమేనని, కచ్చితంగా ఇంతమంది చనిపోయని అమిత్‌ షా చెప్పలేదన్నారు. చాలామంది చనిపోయి ఉంటారని మాత్రమే ఆయన చెబుతున్నారని వీకే సింగ్‌ వివరణ ఇచ్చారు. పాకిస్తాన్‌లోని ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా… అత్యంత జాగ్రత్తగా ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నామన్నారు.